ఇంజన్‌ ట్రబుల్‌.. క్షమించండి: రాహుల్‌ గాంధీ

26 Apr, 2019 12:30 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధే ట్వీటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ పట్నా వెళ్లే నా విమాన ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించాం. ఈ రోజు బీహార్‌లోని సమస్తిపూర్‌, ఒడిశాలోని బాలసోర్‌, మహరాష్ట్రలోని సంగమ్నెర్‌లోని ప్రచార సభలకు హాజరు కావాల్సింది. ఇంజన్‌ ట్రబుల్‌ వల్ల ఈ సభలకు హాజరవ్వడం ఆలస్యం అవుతుంది. నా కారణంగా మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను’ అని దీనికి సంబంధించిన వీడియోను జత చేస్తూ ట్వీట్‌ చేశారు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీహార్‌లోని పాట్నాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్‌ విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి తరలించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఓ దశలో అది కూలిపోతుందనే భావించారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో రాహుల్ అప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. 

మరిన్ని వార్తలు