నోటిఫికేషన్‌ వచ్చినా.. ఇంకా చర్చలేనా.. రాహుల్‌ గుస్సా!

12 Nov, 2018 12:37 IST|Sakshi

రాహుల్‌ గాంధీ నివాసంలో కీలక భేటీ

సీట్ల సర్దుబాట్లు, పొత్తులపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్‌ కూడా వెలువడి.. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. అయినా ప్రధాన ప్రతిపక్షమైన మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కేటాయింపు అంశమూ ఇంకా ఖరారు కాలేదు. ఇటు సీట్ల సర్దుబాటుపై చర్చలు ఎడతెగకుండా కొనసాగుతుండటం.. అటు  మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు పంచాల్సిన సీట్ల లెక్క తేలకపోవడంపై పార్టీ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనా అభ్యర్థులను ఇంకా ఖరారు కాకపోవడంపై ఇటు పార్టీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తన నివాసంలో రాహుల్ గాంధీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియాతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు వివాదం, సీపీఐ డిమాండ్‌ చేస్తున్న మునుగోడు, కొత్తగూడెం స్తానాల అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారుపై ఫిర్యాదులు, బీసీలకు సీట్ల కేటాయింపు, కూటమి పార్టీలకు సీట్ల పంపకం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉంచిన 19 స్థానాలపైనా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో , స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌ దాస్, కమిటీ సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, ఏఐసీసీ కార్యదర్శులు  సలీం , బోస్ రాజు తదితరులు ఉన్నారు. టీడీపీకి 14 స్థానాలు ఎక్కడెక్కడ కేటాయించింది, జనసమితి 8 స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయనున్నది, సీపీఐ స్థానాల వివరాలు రాహుల్‌కి నేతలు వివరించనున్నారు

మరిన్ని వార్తలు