వయనాడ్‌లో రాహుల్‌ మానియా

8 Jun, 2019 04:34 IST|Sakshi
రోడ్‌షోలో అభివాదం చేస్తున్న రాహుల్‌ గాంధీ

భారీ వర్షంలోనూ రాహుల్‌ రోడ్‌ షో

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం

మలప్పురం(కేరళ): లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు శుక్రవారం కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ మలప్పురం జిల్లా కలికావుకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోకు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వయనాడ్‌ నియోజకవర్గం వ్యాపించి ఉన్న వయనాడ్, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో పర్యటనకు రాహుల్‌ శుక్రవారం కోజికోడ్‌కు చేరుకున్నారు.

ముందుగా కలికావు పట్టణంలో ఓపెన్‌ టాప్‌ జీపులో చేపట్టిన రోడ్‌ షోకు భారీ స్పందన లభించింది. జోరువానలోనూ ప్రజలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. యూడీఎఫ్‌ కూటమికి చెందిన ఐయూఎంఎల్‌ కార్యకర్తలు కూడా ఈ రోడ్‌ షోలో పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్‌కు భారీగా భద్రత కల్పించారు. రాహుల్‌ వెంట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. రాహుల్‌ పర్యటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగిస్తుందని నేతలు అంటున్నారు.

బీజేపీ విద్వేషాన్ని ప్రేమతో జయిస్తా
ఈ సందర్భంగా రాహుల్‌ ప్రసంగిస్తూ..‘వయనాడ్‌ ఎంపీగా రాష్ట్ర ప్రజలందరి తరఫున పార్లమెంట్‌లో మాట్లాడతా. రాజకీయాలతో పని లేకుండా ఇక్కడి సమస్యలపై పార్లమెంట్‌ లోపలా వెలుపలా పోరాడుతా. నియోజక వర్గం కోసం మీ తరఫున పనిచేస్తా. మీ సమస్యలు వింటా. నాపై ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు. దేశంలో బీజేపీ వ్యాపింప జేస్తున్న విద్వేషాన్ని, అసహనాన్ని ప్రేమ, ఆప్యాయతలతో ఎదుర్కొంటానని తెలిపారు. ‘మోదీకి డబ్బు, మీడియా, ధనవంతులైన స్నేహితులు ఉండి ఉండవచ్చు. కానీ, బీజేపీ సృష్టించిన అసహనాన్ని కాంగ్రెస్‌ ప్రేమతో ఎదిరించి పోరాడుతుంది’ అని తెలిపారు. రాహుల్‌ వయనాడ్‌ నుంచి 4.30 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు