వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ

11 Jun, 2018 19:19 IST|Sakshi

ప్రధాని మోదీ కంటే ముందే పెద్దాయనను కలిసిన కాంగ్రెస్‌ చీఫ్‌

సాక్షి, న్యూఢిల్లీ: వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయిని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మర్యాద పూర్వకంగా కలుసుకుని పరామర్శించారు. 93 ఏళ్ల వాజ్‌పేయి.. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో చేర్పించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కాగా, పెద్దాయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వైద్య పరీక్షల కోసం మాత్రమే వాజ్‌పేయి ఆస్పత్రిలో చేరారని ఎయిమ్స్‌ ప్రకటించింది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం వాజ్‌పేయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది.

కాగా, సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే ఎయిమ్స్‌కు వెళ్లారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆరా తీశారు. రాహుల్‌ వెళ్లిపోయిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎయిమ్స్‌కు వచ్చారు. అటల్‌ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన ప్రధాని మోదీ.. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాలు కూడా వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు