నేడు రాష్ట్రానికి రాహుల్‌

20 Oct, 2018 01:24 IST|Sakshi

భైంసా, కామారెడ్డిల్లో బహిరంగ సభలు

చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావన దినోత్సవానికి హాజరు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసా, కామారెడ్డిల్లో జరిగే ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. చివరి నిమిషంలో రాహుల్‌ షెడ్యూల్‌కు మార్పులు చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో రాహుల్‌ నాందేడ్‌ చేరుకొని అటు నుంచి హెలికాప్టర్‌లో బైంసాకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో కామారెడ్డి చేరుకుని మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ రెండు సభల్లోనూ ఆయన 40 నిమిషాల చొప్పున ప్రసంగించే అవకాశం ఉంది. అనంతరం రాహుల్‌ హైదరాబాద్‌ చేరుకుని, సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లేలా షెడ్యూల్‌ ఖరారైంది.

రాహుల్‌ పాల్గొనే బహిరంగ సభలు విజయవంతమయ్యేలా.. టీపీసీసీ భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి ఊపు తెచ్చే విధంగా ఈ సభలు జరగాలని ప్రణాళికలు వేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ సభలు జరిగే ప్రాంతాలను సందర్శించారు. భారీ జనసమీకరణకు వీలుగా జిల్లా నాయకులకు సూచనలు చేశారు. ఈ సభల్లో కేసీఆర్‌ కుటుంబ పాలనను ఎండగడుతూనే, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. వెంటనే అమలు చేయనున్న కార్యక్రమాలను రాహుల్‌ ప్రస్తావించేలా కాంగ్రెస్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేసింది. ముఖ్యంగా రూ.2లక్షల రైతు రుణమాఫీ, మహి ళా సంఘాలకు రుణాలు, ఉద్యోగాల భర్తీకి తీసుకునే చర్యలపై రాహుల్‌ తన ప్రసంగంలో కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది. కాగా, భారత దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో మరో జాతీయ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటనను ప్రజా గాయకుడు గద్దర్‌ స్వాగతించారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో జరిగే రాహుల్‌ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు