రాహుల్‌గాంధీ... దక్షిణాది కథేంది?

14 Apr, 2019 06:01 IST|Sakshi

వయనాడ్‌? అమేథీ?

రెండుచోట్లా గెలిస్తే వదులుకునే స్థానమేది?

వయనాడ్‌లో పోటీపై కాంగ్రెస్‌ కొత్త భాష్యాలు

అమేథీలో మసకబారుతున్న ప్రభ..

దక్షిణాదిపై పట్టు పెంచుకునేందుకే పోటీ?

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీ నుంచి కాక, ఈసారి దక్షిణాదిలోని కేరళకు చెందిన వయనాడ్‌ నుంచి కూడా పోటీకి దిగారు. ఒకవేళ రాహుల్‌కి అన్నీ అనుకూలంగా మారి అటు అమేథీలోనూ, ఇటు వయనాడ్‌లోనూ రెండుచోట్లా గెలిస్తే ఏం చేయాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రియాంక ప్రజలతో మమేకమవుతోన్న తీరూ, యూపీలో ప్రియాంకకు వస్తోన్న ఆదరణా, ప్రియాంకలో ఇందిరను చూసుకొంటోన్న జనం ఆశలూ ఆ పార్టీని గట్టెక్కించి, కాంగ్రెస్‌కి పూర్వ వైభవం కట్టబెడుతుందన్న ఆశలు కాంగ్రెస్‌కి కొత్త ఊపుని తెచ్చిపెట్టాయి.

పెట్టని కోటను వదిలిందెందుకు?
కాంగ్రెస్‌కి పెట్టని కోటలాంటి అమేథీని వదిలి రాహుల్‌ వయనాడ్‌ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకి రకరకాల సమాధానాలు వస్తున్నాయి. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్‌ దక్షిణాది వెళ్లారని బీజేపీ వాదిస్తోంటే దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్‌ నాయకుల ప్రోద్బలంతోనే రాహుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్‌ చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ రాహుల్‌ వయనాడ్‌ ఆలోచన దక్షిణాదిలో పట్టు సాధించేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే ఒకవేళ రాహుల్‌ అటు అమేథీ, ఇటు వయనాడ్‌ రెండింటా విజయం సాధిస్తే ఏం చేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాహుల్‌ వయనాడ్‌ని నిలుపుకుంటే పార్టీకి మంచిదన్న భావన ఇటు దక్షిణాదిలోని కాంగ్రెస్‌ వర్గాల్లోనూ, అటు రాజకీయ నిపుణుల్లోనూ ఉంది. అయితే దక్షిణాదిలో కాంగ్రెస్‌ పునాదులను బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్‌ భావించడానికి మరో ప్రధానమైన కారణం కూడా లేకపోలేదంటున్నారు పలువురు. ఉత్తర భారతంలో మాదిరిగా హిందూత్వవాదం, జాతీయతా నినాదం దక్షిణ భారతంలో పెద్దగా చెల్లుబాటు కాదన్న భావన కూడా అందుకు కారణమని వారు భావిస్తున్నారు.

దక్షిణాదిలో పట్టుకోసమేనా?
25 పార్లమెంటు సీట్లున్న ఆంధ్రప్రదేశ్, 17 సీట్లున్న తెలంగాణ, 28 సీట్లున్న కర్ణాటక, 20 సీట్లున్న కేరళ, 39 పార్లమెంటు సీట్లున్న తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు ప్రధాన రాష్ట్రాలకీ కలిపి దక్షిణ భారతంలో 129 సీట్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో  2014లో దక్షిణ భారతంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లోని మొత్తం 129 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 19 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. అయితే అప్పుడు దేశమంతా మోదీ గాలి వీచింది. అంత మోదీ హవాలోనూ 19 స్థానాలు గెలవడం అంత తేలిక కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే దక్షిణాదిలో రాహుల్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు.

ఉత్తరాదిలో రాహుల్‌ ఫెయిల్‌?     
ఉత్తరప్రదేశ్‌ గురించి చెప్పుకోవాలంటే రాహుల్‌ గాంధీ నాయకత్వం ఉత్తరప్రదేశ్‌లో ఫెయిల్‌ అయ్యిందని అంతా భావిస్తున్నారు. ఒకవేళ అమేథీలో, వయనాడ్‌లోనూ రెండు స్థానాలూ రాహుల్‌ కైవసం చేసుకున్నా, అమేథీని వదులుకొని వయనాడ్‌నే రాహుల్‌ ఎంచుకోవడం మంచిదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ అనుయాయుల్లో బలంగా వినిపిస్తోంది. ఉత్తరాదిలో ఉన్నా రాహుల్‌ పెద్దగా చేయగలిగేది లేదని కూడా వారు వాదిస్తున్నారు. దీనికి తోడు ఉత్తరాదిలో బీజేపీ ప్రాభవం తగ్గకపోగా పెరుగుతోండడం దక్షిణాదిలో కాంగ్రెస్‌ బలపడాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెబుతోంది. అందుకే కేరళలో కాంగ్రెస్‌ అధ్యక్షుడి పోటీ తమిళనాడు, కర్ణాటకలో సైతం కాంగ్రెస్‌ పార్టీకి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఉత్తరాదిలో ప్రజాదరణ ప్రియాంకకేనా?
నాయనమ్మ పోలికలూ, జనంలో ఉన్నప్పుడు ప్రియాంక చూపుతోన్న చొరవ, సామాజిక అవగాహనలో ఆమె పరిణితి ప్రియాంకకు ఉత్తరాది ప్రజల్లో ఆదరణని తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా ఆ పార్టీ వర్గాలు సైతం ప్రియాంకా గాంధీని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గాంధీ కుటుంబం పోటీ చేస్తోన్న, కాంగ్రెస్‌కి కంచుకోటలాంటి అమేథీ స్థానంలో రాహుల్‌ తన సొంత సీటునే కోల్పోయి, ఓటమి బాటలో పయనిస్తున్న సందర్భంలో ప్రియాంకాగాంధీ యూపీలో పూర్తి బాధ్యతలు తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమవ్వాలని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తమిళనాట నాయకత్వ శూన్యత కాంగ్రెస్‌కి అనుకూలిస్తుందా?
ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రం నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే తమిళనాట ఏర్పడిన నాయకత్వ శూన్యతను కాంగ్రెస్‌ పూరించే అవకాశం మెండుగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్‌ తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలనుకుంటే ప్రజాదరణ ఉన్న ప్రియాంకా గాంధీకి ఉత్తర భారత బాధ్యతలు పూర్తిగా అప్పగించి రాహుల్‌ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని రాజకీయ నిపుణుల అభిప్రాయం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దక్షిణాదికి ఇంకా ఎక్కువ సమయాన్ని వెచ్చించి, మరింత శక్తివంతంగా పనిచేయాల్సి ఉంటుందని రాజకీయ నిపుణుల అంచనా.

గాంధీ కుటుంబానికి దక్షిణాదే సురక్షితం!
గాంధీ కుటుంబం దక్షిణ భారతం నుంచి పోటీ చేయడం ఇది మొదటిసారి మాత్రం కాదన్న విషయం గుర్తుచేసుకోవాలి. 1978లో ఇందిరాగాంధీ కర్ణాటకలోని చిక్‌మగళూరు నుంచీ, ఆ తరువాత 1980లో ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ నుంచి పోటీ చేశారు. రాహుల్‌ తల్లి సోనియాగాంధీ కూడా కర్ణాటకలోని రాయబరేలీ నుంచి 1999లో పోటీ చేశారు. భారత చరిత్రలోనే చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబరేలీలో జనతా అభ్యర్థి రాజ్‌నారాయణ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆ తరువాత ఆమె లోక్‌సభలోకి ప్రవేశించడానికి కర్ణాటకలోని చిక్‌మగళూరుని సురక్షితమైన సీటుగా భావించి 1978లో అక్కడి నుంచి పోటీచేశారు. ఈ సందర్భంగా ఇందిర ఇచ్చిన నినాదం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అదే ‘ఏక్‌ షేర్నీ, సౌ లంగూర్, చిక్‌మగళూరు, చిక్‌మగళూరు’ నినాదం. అయితే ఆ తరువాత కూడా మళ్లీ 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాయబరేలీతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ గెలిచాక ఇందిరాగాంధీ రాయబరేలీని వదులుకొని మెదక్‌ నుంచి లోక్‌సభలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇందిరాగాంధీ 1984లో చనిపోయే వరకూ అదే నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి ప్రాతిని«ధ్యం వహించారు.  

మరిన్ని వార్తలు