రాగాలాపన

21 Apr, 2019 06:05 IST|Sakshi

కేరళలో రాహుల్‌ గాంధీ ఎఫెక్ట్‌..

అధ్యక్షుడే బరిలో దిగడంతో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు

శబరిమల అస్త్రంతో బోణీ కొట్టే వ్యూహంలో బీజేపీ

ఆత్మరక్షణలో అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి

దేవతలు నడయాడే భూమిగా పిలిచే కేరళలో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. అయ్యప్ప శరణుఘోష మిన్నంటే ప్రాంతంలో ఎన్నికల రణన్నినాదాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్రంలో రెండే పక్షాలు.. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌).. లేదంటే వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌). అయిదేళ్లకి ఒకసారి కూటమిని మార్చే సంప్రదాయం ఈ రాష్ట్రం సొంతం. ఇక, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచి పోటీకి దిగడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. శబరిమల వివాదం కమలనాథులకు ఓట్లు రాలుస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టమ్మీద ఒక్క సీటు సాధించిన బీజేపీ.. లోక్‌సభలో ఖాతా తెరుస్తుందా?.. అంతటా ఇవే ప్రశ్నలు..ఓటరు తీర్పెలా ఉండనుందో?.

పర్యాటకులకు అదొక స్వర్గధామం. పచ్చని చెట్లు, బ్యాక్‌ వాటర్స్, మలబారు తీరం హాయిగొలిపి సేదదీరుస్తాయి. కేరళలో అక్షరాస్యత ఎక్కువ. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు ఉంది. కానీ కొన్ని వర్గాల ప్రజల్లో మత మౌఢ్యాలు, సంకుచిత స్వభావాలతో చైతన్యం పెరగలేదు. హిందువుల్లో అగ్రకులమైన నాయర్లు, వెనుకబడిన కులమైన ఈళవల ప్రాబల్యం ఎక్కువ. సాధారణంగా వామపక్షాల భూస్వామ్య వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్‌ జాతీయవాదం మధ్య ఓట్లు చీలిపోతుంటాయి. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాలను ప్రతీ ఎన్నికల్లోనూ మార్చడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రెండు కూటములు మైనార్టీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాయి.

ఇప్పుడు బీజేపీ శబరిమల వివాదంతో తమ ఓటు బ్యాంకుని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సీపీఎం, ఆరెస్సెస్‌ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ రాజకీయ హత్యలకు పాల్పడడం రాజకీయాల్ని ప్రమాదంలో పడేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ కార్యకర్తలు హత్యకు గురికావడం, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత దాదాపు ఆరు లోక్‌సభ సీట్లలో ప్రభావం చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ బరిలో దిగడంతో ఆ పార్టీ ప్రధాన మిత్రపక్షమైన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌)లో ఉత్సాహం పొంగిపొరలుతోంది. ముస్లింలంతా ఈసారి యూడీఎఫ్‌ కూటమికే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ ఖాతా తెరుస్తుందా?
ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని బీజేపీ.. ఈసారి బోణీ కొట్టాలని ప్రయత్ని స్తోంది. భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌)తో పొత్తు పెట్టుకొని లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా సంఘ్‌ పరివార్‌ తన కార్యకలాపాల్ని బాగా విస్తరించింది. కొన్ని సామాజిక అంశాలను లేవనెత్తుతూ పోరుబాట పడుతోంది. వాటిలో గోవధ, గో మాంసం వినియోగంపై నిషేధం, లవ్‌ జీహాద్, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటివి ఉన్నాయి. వీటి ద్వారా రాజకీయంగా  లబ్ధి పొందాలని ప్రయత్ని స్తోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కేరళలో ఏకంగా ఐదు వేల శాఖల్ని ప్రారంభించింది. సంప్రదాయంగా కేరళ రాష్ట్రంలో హిందూత్వ సిద్ధాంతాలకు అంతగా ఆదరణ లేకున్నా.. శబరిమల అంశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతు అంతో ఇంతో కనిపించింది. మహిళలు రుతుస్రావం జరిగే వయసులో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లకూడదనేది నాయర్ల వాదన. వారికి మద్దతుగా బీజేపీ కూడా మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం దేవుడు లేడని తాను నమ్మడమే కాదు, హిందువులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది.

ఆ నాలుగు సీట్లపైనే బీజేపీ ఆశలు
2014 లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో బీజేపీ పది శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. ఈసారి శబరిమల వివాదం తమకి ఓట్లు రాలుస్తుందని ఆశలు పెట్టుకుంది. తిరువనంతపురం, త్రిస్సూర్, పథనం తిట్ట, కాసర్‌గోడ్‌ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్న బీజేపీ.. ఆ 4 సీట్లపై దృష్టి సారించింది. తిరువనంతపురంలో  బరిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ (కాంగ్రెస్‌)కి గట్టి పోటీ ఇవ్వడానికి మిజోరం మాజీ గవర్నర్‌ కుమ్మనం రాజశేఖరన్‌ను పోటీకి దించింది. శబరిమల వివాదం తర్వాత నెలకొన్న వాతావరణం నేపథ్యంలో రాజశేఖరన్‌ గెలుపు గుర్రంగానే భావిస్తు న్నారు. ఇక ఎల్‌డీఎఫ్‌ నుంచి మంత్రిగా ప్రజాదరణ పొందిన సి.దివాకరన్‌ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ముగ్గురే కావడంతో ఫలితం అంతుబట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో శశిథరూర్‌కి 34.09 శాతం ఓట్లు  పోలైతే,  32.09 శాతం ఓట్లతో రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒ.రాజగోపాల్‌ నిలిచారు. వీరిద్దరి మధ్య ఓట్లలో తేడా చాలా తక్కువగా ఉండడం గమనార్హం.

వరద చుట్టూ రాజకీయాలు
గత ఏడాది ఆగస్టులో కేరళని వరదలు ముంచెత్తి అతలాకుతలం చేశాయి. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పి.విజయన్‌ (కేరళ సీఎం) సర్కార్‌ సహాయ చర్యలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వరద సహాయ చర్యల్లో ఎల్‌డీఎఫ్‌ సర్కార్‌ విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోంటే, కేంద్రం నుంచి సరైన సాయం అందలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో మోదీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది. వరదలు ముంచెత్తి ఇప్పటికే ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వందల కుటుంబాలు కోలుకోలేని స్థితిలోనే ఉన్నాయి. దక్షిణ కేరళలో అలపుజ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొన్ని ఇళ్లు మామూలు రూపురేఖలకు రాలేదు.

బూత్‌ల ఏర్పాటుకు వెతుకులాట
వరద బీభత్సానికి లోనైన పాఠశాలల్లో ఇంకా మరమ్మతు పనులు పూర్తి కాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా 441 పోలింగ్‌ స్టేషన్లను వెతుక్కోవాల్సిన పనిలో ఉంది. పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేయడానికి కొత్తవి, సురక్షితమైన భవనాలు వెతుక్కోవడం ఎన్నికల సంఘానికి సవాల్‌గానే మారింది. కానీ పోలింగ్‌ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి టీకా రామ్‌ మీనా ధీమా వ్యక్తం చేశారు.

మహిళల స్థానం ‘ఇంతి’ంతే!
రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ మహిళలను చట్టసభలకు పంపే అంశంలో కేరళ ఇంకా వెనుకబడే ఉంది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఏకైక మహిళ పి.కె. శ్రీమతి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోకసభలో మహిళల ప్రాతినిధ్యం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సభ్యులకు 61 మంది మహిళలు ఎన్నికైతే (11.23%), కేరళ నుంచి ఎన్నికైన 20 మంది సభ్యుల్లో ఒక్కరే మహిళ (5%). ఈసారి ఎన్నికల్లో సీపీఎం ఇద్దరు మహిళలకు సీట్లు ఇస్తే, కాంగ్రెస్, బీజేపీ కూడా ఇద్దరు అభ్యర్థులనే బరిలో నింపాయి. మహిళలకు సీట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలన్నిటిదీ ఒకే దారి.  ఈసారైనా కేరళ ఓటర్లు మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతారా లేదా అన్న చర్చ నడుస్తోంది.

► ఎల్‌డీఎఫ్‌.. సిట్టింగ్‌ ఎంపీ శ్రీమతితో పాటు పథనం తిట్ట నుంచి వీణా జార్జ్‌కు టికెట్లు ఇచ్చింది. 70 ఏళ్ల వయసులోనూ విస్తృత ప్రచారం చేస్తున్న శ్రీమతి గెలుపుపై ధీమాతో ఉన్నారు.

► కాంగ్రెస్‌ కూడా ఇద్దరు మహిళలకు సీట్లు ఇచ్చింది. అలపుజ నుంచి శనిమోల్‌ ఉస్మాన్‌ను బరిలోకి దింపితే అళత్తూర్‌ నుంచి రమ్య హరిదాస్‌కు పోటీకి దించింది. ఎస్సీ రిజర్వుడు సీటు నుంచి పోటీ చేస్తున్న రమ్య హరిదాస్‌ మంచి గాయని. మ్యూజిక్‌లో బీఏ చేసింది. రమ్య తండ్రి రోజు కూలి. తల్లి మహిళా కాంగ్రెస్‌లో సభ్యురాలు. రమ్యలో టాలెంట్‌ను చూసి రాహుల్‌ స్వయంగా పిలిచి సీటు ఇచ్చారు.

► బీజేపీ కూడా ఇద్దరికే సీట్లు ఇచ్చింది. అత్తింగళ్‌ నుంచి శోభా సురేంద్రన్, పొన్నాని నుంచి వి.టి.రమను బరిలోకి దింపింది.  

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు
శబరిమల వివాదం: అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా సుప్రీం తీర్పు, అనంతర పరిణామాలను బీజేపీ అస్త్రంగా చేసుకొని కొన్ని సీట్లయినా కొల్లగొట్టాలని వ్యూహరచన చేస్తోంది

రాజకీయ హత్యలు: ఆర్‌ఎస్‌ఎస్, సీపీఎం, కాంగ్రెస్‌.. ఈ మూడూ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నాయి. కాసరగోడ్, కన్నూర్, వడకరలో రాజకీయ హింసే ప్రచారాస్త్రం కానుంది

వరదలు– సహాయ చర్యలు: గత ఏడాది ఆగస్టులో వరదలు ముంచెత్తినపుడు విజయన్‌ సర్కార్‌ శక్తివంచన లేకుండా సహాయ కార్యక్రమాలు అందించినా, చాలాచోట్ల పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదు. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు భవనాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. దీనినే కాంగ్రెస్‌ అస్త్రంగా మలచుకుంది

రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ సంక్షోభం: పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన నష్టంపై గ్రామీణ ప్రాంతవాసులు కేంద్రంపై గుర్రుగా ఉన్నారు.

రాహుల్‌ గాంధీ ప్రభావం: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ స్థానం నుంచి స్వయంగా పోటీకి దిగడంతో.. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారతాయని అంచనా. రాహుల్‌ని ఓడించలేని ఇతర పక్షాలు కనీసం ఆయన మెజారిటీ తగ్గించడానికి వ్యూహాలు పన్నుతున్నాయి.

దేశంలోనే అక్షరాస్యత ఎక్కువగా ఉందని భుజాలు చరుచుకుంటాం. మహిళా ఓటర్లు ఎక్కువని గర్వపడతాం. కానీ మహిళల్ని చట్టసభలకు పంపాలంటే ఎవరికీ మనసు రావడం లేదు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం నిజంగా సిగ్గుపడే విషయం. మా పార్టీ ఈసారి ముగ్గురికి సీట్లు ఇవ్వాలని అనుకుంది. కానీ రాజకీయ సమీకరణల మధ్య ఇద్దరికే ఇచ్చింది. ఎప్పటికైనా ఈ సంఖ్య పెరగాలని ఆశిస్తున్నాను.
– పి.కె.శ్రీమతి, సీపీఎం, కన్నూర్‌ సిట్టింగ్‌ ఎంపీ

వయనాడ్‌.. వార్‌ వన్‌సైడ్‌
కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్ని పంచుకుని ఉన్న వయనాడ్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత సురక్షితమైన స్థానం. మల్లాపురంలో కొంత భాగం, కోజికోడ్‌లో కొంత భాగం కలిసి 2008లో వయనాడ్‌ స్థానం ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షానవాజ్‌ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో లక్షా 50 వేల ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించిన ఆయన గత ఎన్నికల నాటికి ఆధిక్యం 20 వేలకు పడిపోయింది. గత ఏడాది ఆయన మరణించడంతో రాహుల్‌ ఈ సీటుని ఎంచుకున్నారు. ‘కేంద్రంలో మోదీ సర్కార్‌ దక్షిణాదిని చిన్న చూపు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో స్థానికుల్లో, కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. అది చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది’ అని యూడీఎఫ్‌ సభ్యుడు సురేశ్‌ బాబు  అభిప్రాయ పడ్డారు. వయనాడ్‌ జనాభాలో 12 లక్షల మందికిపైగా ఆదివాసీలు ఉన్నారు. వీరంతా నిరుపేదలు కావడంతో కాంగ్రెస్‌ ఎన్నికల హామీలో ప్రధానమైనది కనీసం ఆదాయ పథకం వీరందరికీ ఎంతటి ఉపయోగకరమో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు సోషల్‌ మీడియాలో, ఇటు సభల్లో కూడా కాంగ్రెస్‌ ప్రచారం తారస్థాయికి చేరుకుంది. రాహుల్‌.. తన ట్విట్టర్‌ ఖాతాలో కూడా మలయాళం భాషలోనే ట్వీట్లు పెడుతున్నారు. ‘గాంధీ అనే పేరు చాలు రాహుల్‌ని గెలిపించడానికి. భవిష్యత్‌లో ఆయన ప్రధాని అయితే మాకే గర్వకారణం’ అని అక్కడి యువత ముక్తకంఠంతో చెబుతున్నారు. ‘ఇప్పుడు రాహుల్‌ గెలుస్తారా లేదా అన్నది కాదు. ఆయన పోటీ ప్రభావం ఎన్ని సీట్లపై ఉంటుంది?, ఇతర పార్టీల ప్రభావాన్ని ఎంత వరకు తగ్గించగలరు’ అనేదే ఇతర పక్షాలకు అసలు సిసలైన సవాల్‌ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

సర్వేలు ఏం చెబుతున్నాయ్‌?
సర్వేలన్నీ ఈసారి యూడీఎఫ్‌కు అనుకూలంగానే ఉన్నాయి. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలిచి బోణీ కొడుతుందని సర్వేల అంచనా. ఇక అధికార ఎల్‌డీఎఫ్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి.


రాజశేఖరన్, విజయన్, శశిథరూర్, రమ్యా హరిదాస్‌


శోభా సురేంద్రన్,వీణా జార్జ్,దివాకరన్, శ్రీమతి


మరిన్ని వార్తలు