మోదీలా అబద్ధాలు చెప్పను

18 Apr, 2019 01:40 IST|Sakshi
తిరునెల్లిలో పూజలు చేస్తున్న రాహుల్‌. శ్రీధన్య కుటుంబసభ్యులతో రాహుల్‌

ఆచరణ సాధ్యమైన హామీలిస్తా

వయనాడ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌

సుల్తాన్‌ బతేరి/వయనాడ్‌: ప్రధాన నరేంద్ర మోదీలా తాను అబద్ధపు హామీలు ఇవ్వనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన వయనాడ్‌లోని మూడు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్దాలని చూస్తున్నాయని ఆరోపించారు. దేశ సంస్కృతి, చరిత్ర గురించి ఉద్భోద చేయడానికి అసలు మోహన్‌ భగవత్‌ ఎవరని ప్రశ్నించారు.

దక్షిణాది రాష్ట్రాల గొంతుకను దేశానికి వినిపించడం ముఖ్యమని భావించానని అన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలు ఎంత ముఖ్యమో దక్షిణాది కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని చాటడం కోసమే ఇక్కడి నుంచి పోటీచేస్తున్నానని వెల్లడించారు. తనను ఒక సోదరుడిలా, కుమారుడిలా భావించాలని వయనాడ్‌ వాసులను కోరారు. విభిన్న కులాలు, మతాల ప్రజలంతా కలిసి వయనాడ్‌లో నివసిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలంతా కేరళ, వయనాడ్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు రాహుల్‌గాంధీ వయనాడ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరునెల్లిని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ అస్థికలను కలిపిన ఈ ప్రాంతంలో ‘బలి తర్పణం’కార్యక్రమాన్ని నిర్వహించారు.  

శ్రీధన్యను కలిసిన రాహుల్‌
తిరువంబడి: కేరళ నుంచి సివిల్స్‌ సాధించిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందిన వయనాడ్‌ యువతి శ్రీధన్య సురేష్‌ను రాహుల్‌ గాంధీ బుధవారం కలిశారు. సుల్తాన్‌ బతేరీలోని గెస్ట్‌ హౌస్‌లో శ్రీధన్యతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఓ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. శ్రీధన్య సివిల్స్‌ సాధించడానికి అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారెంట్రీ స్కీమ్‌ (ఎమ్‌ఎన్‌ఏఆర్‌ఈజీఎస్‌) తోడ్పడిందని తెలిపారు.  

>
మరిన్ని వార్తలు