నూతనోత్సాహంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు

2 Apr, 2019 11:33 IST|Sakshi
ప్రజలకు రాహుల్‌ అభివాదం, జహీరాబాద్‌ సభకు హాజరైన జనం

సాక్షి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సభ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రసంగంతో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సభలో పాల్గొన్న వక్తలందరూ కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎన్నికల ప్రచారంలో జోష్‌ పెంచేలా కృషి చేయాలని సూచిస్తూ ఉత్తేజ పరిచారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని తాపత్రయపడుతున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో పార్టీ అధినేతతో ప్రచారం ప్రారంభించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నుంచే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రచారం ప్రారంభించారు. జహీరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జహీరాబాద్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు, మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌లకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఇదే రోజు రాష్ట్రంలోని వనపర్తి, హుజూర్‌నగర్‌ ఎన్నికల సభల్లో పాల్గొనాల్సి ఉండడంతో జహీరాబాద్‌లో గంట సమయం మాత్రమే రాహుల్‌గాంధీ వేదికపై సమయాన్ని వెచ్చించారు. సుమారుగా 25 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్‌ పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్, నరేంద్రమోదీలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు.

ప్రధాని నరేంద్రమోదీ కాపలాదారు (చౌకీదార్‌) నిజమేనని, కానీ పేదలకోసం కాకుండా ధనవంతులకు కాలపలాగా ఉంటున్నారని ఆరోపించారు. అనిల్‌అంబానీ, నీరవ్‌మోదీ లాంటి వాళ్లకు వేల కోట్ల రూపాయలను దోచి పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. రాఫెల్‌ కుంభకోణం గురించి ఎన్నిసార్లు ఆరోపించినా మోదీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు, నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చి ప్రతీ పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న హామీ, తదితర అంశాల గురించి తీవ్రస్థాయిలో నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. అదేవిధంగా కేసీఆర్, నరేంద్రమోదీలు ఒక్కటేనని, అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై కేసీఆర్‌ ఎప్పుడైనా విమర్శించారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ వారం రోజులు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

మరిన్ని వార్తలు