ఈ నెలలోనే రాహుల్‌ సభ

12 Oct, 2018 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఈ నెల లో రాష్ట్రానికి వచ్చే అవ కాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెల 20, 24, 27 తేదీల్లో ఏదో ఒకరోజు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాల సమాచారం. ఆయన వచ్చే తేదీని బట్టి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో ఏదోకచోట భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. రాహుల్‌ పర్యటనకు సంబంధించిన తుది షెడ్యూల్‌ ఖరారు కాలేదని, ఈ మూడు తేదీల్లో ఒకరోజు రాహుల్‌ వచ్చేందుకు సమ్మతించారని పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.   

‘కేసీఆర్‌వి అన్నీ మోసాలే’
నల్లగొండ: రాష్ట్ర ప్రజలను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మోసం చేశారని సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన నల్లగొండలో వెయ్యి మంది కార్యకర్తలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కేసీఆర్‌ ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ విద్యను అందుబాటులోకి తీసుకువస్తానని, తన మనుమడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడో అందరి పిల్లలు అదే పాఠశాలల్లో చదువుతారని చెప్పి మోసం చేశాడన్నారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, అయితే ఇప్పటికీ ఏ ఒక్కటీ పూర్తి చేసిన దాఖలాలు లేవని అన్నారు. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరవాత రూ.5 లక్షలతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించి తీరుతామని చెప్పారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పకపోతే ప్రజలకు మరింత ఇబ్బందులు తప్పవన్నారు.  

కాంగ్రెసులో చేరిన మౌలానా బాబా
సాక్షి, హైదరాబాద్‌: కోదాడ నియోజకవర్గానికి చెందిన వనస్థలిపురం మౌలానా బాబా గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌలానా బాబాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తమ్‌ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు