రాహుల్‌ దేశాటన!

30 Jun, 2019 04:50 IST|Sakshi

పాదయాత్రతో జనంలోకి ?

వచ్చే ఎన్నికల నాటికి ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక

కాంగ్రెస్‌ మూడు ఎజెండాలు పార్టీ జెండాను ఎగురవేస్తాయా?

135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత నెలరోజులుగా నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణుల్లో పార్టీ భవితవ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగనని తేల్చి చెప్పేయడం, ఆయన స్థానంలో ఎవరు వస్తారోనన్న గందరగోళం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పదవులకు సీనియర్‌ నేతల మూకుమ్మడి రాజీనామాలు ఇవన్నీ ఓ రకమైన సంక్షోభానికి దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తలు దశలవారీగా పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరి ముందు ఇప్పుడు మూడు ఎజెండాలే ఉన్నాయి. అవే కాంగ్రెస్‌ జెండాని తిరిగి ఎగురవేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నారు.  

రాహుల్‌ పాదయాత్ర
ఏసీ గదుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నాళ్లు మేధోమథనం జరిపినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లిన వాడే నాయకుడిగా అవతరిస్తాడని, ప్రజా సమస్యలు కళ్లారా చూసినప్పుడే రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలరని చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అందుకే రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందని ప్రతిపాదనలు ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్‌ ఎంతవరకు జయప్రకాశ్‌ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్‌ మాదిరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలరా అన్న అనుమానాలూ ఉన్నాయి.  

కొత్త అధ్యక్షుడి ఎన్నిక  
ఇక రాహుల్‌ గాంధీ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఇప్పుడు అందరి కళ్లు రాజస్థాన్‌పైనే ఉన్నాయి. ఇన్నాళూ అశోక్‌ గహ్లోత్‌æ కాంగ్రెస్‌ పార్టీ కాబోయే అధ్యక్షుడని ప్రచారం సాగింది. ఇప్పుడు హఠాత్తుగా సచిన్‌ పైలెట్‌ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరికీ అప్పగించినా పార్టీ భవిష్యత్‌ ఎలా ఉండబోతుంది? ఎన్ని అసమ్మతి జ్వాలలు రేగుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. పార్టీ పగ్గాలను అనుభవజ్ఞుడికి అప్పగించాలా, యువతరం చేతుల్లో పెట్టాలా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి తగాదాను రాహుల్‌ ఎంతవరకు సమర్థవంతగా ఎదుర్కోగలరో చెప్పలేని స్థితి. తమిళ కాంగ్రెస్‌ నాయకుడు కామరాజ్‌ ఫార్ములా తరహాలో రాహుల్‌ గాంధీ మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని తలపోసినా అది కూడా సరిగ్గా నడిచేటట్టుగా అనిపించడం లేదు. మే 25న    రాహుల్‌ తన పదవికి రాజీనామా చేసినా అయిదు    రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అందుకు సిద్ధంగాలేరు. అందుకే అధ్యక్షుడి విషయంలో పార్టీ ఆచితూచి      అడుగులు వేయాల్సి ఉంది.  

2024 ప్రధాని ఫేస్‌గా ప్రియాంక
ఇక ఆఖరి అంకం అంటే కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రియాంకమే. 2024 ఎన్నికల్ని రాహుల్‌ పెద్ద దిక్కుగా ఉండి నడిపించి, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఉంది. ఈ అంశంలో ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోంది. అయితే పెద్ద దిక్కుగా రాహుల్, కొత్త అధ్యక్షుడి పనితీరు, ప్రియాంక ఎలా జనాన్ని మెప్పించగలరు అన్న అంశాలపైనే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదనలను సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్‌ గాంధీపై సానుభూతి, విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం కంటే ఈ నిస్తేజ పరిస్థితులే పార్టీకి ఎక్కువ చేటు కలిగిస్తాయని సీనియర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితికి సోనియా, రాహుల్‌లదే బాధ్యతని, వారి అంగీకారం లేకుండా ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు. 

లోలోపల ఏదో కుట్ర, డ్రామా నడుస్తోందని నేతల అనుమానం. సిసలైన నాయకుడెవరూ కూడా సంక్షోభ సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోరని తెలుగు రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్‌ ముందుగా సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర శాఖలు, ఏఐసీసీ విభాగాలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్నారు. భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుగా ఏఐసీసీ సమావేవం ఏర్పాటు చేసి రానున్న రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని అన్నారు. ఇలా ఉండగా, రాహుల్‌ గాంధీయే చీఫ్‌గా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా అన్నారు. రాహుల్‌ వైదొలుగుతున్నట్లు ప్రకటించినందుకు నిరసనగానే పార్టీ నేతలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. రాహుల్‌ పార్టీ చీఫ్‌గా కొనసాగాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ తీర్మానించిందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు