రాహుల్‌ స్థానంలో సోనియా పేరు!

14 Aug, 2019 18:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీ మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆయన రాజీనామా ఆమోదం పొందిన తర్వాత యూపీఏ చైర్‌పర్సన్‌ మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రాహుల్‌ గాంధీ పోస‍్టర్‌, నేమ్‌ప్లేట్‌ను తొలగించి సోనియా గాంధీ నేమ్‌ ప్లేట్‌ను అక్కడ అమర్చారు. ఇక పార్టీ ప్రధాన కార్యాలయంలో సోనియాతో పాటు ప్రియాంక గాంధీ వాద్రాకు మాత్రమే ప్రత్యేక కార్యాలయాలు ఉండనున్నాయి.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోనియా గాంధీని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా నిర్ణయించినట్లు అంతర్గత ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటామని పార్టీ నాయకుడు పిఎల్‌ పునియా వెల్లడించారు. కాగా సోనియా గాంధీ 1998 నుంచి 2017 వరకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా కొనసాగిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు