రైతు రుణాలు పూర్తిగా మాఫీ

18 Sep, 2018 02:01 IST|Sakshi
భోపాల్‌లో రోడ్‌షోలో రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్యలకు అభివాదం చేస్తున్న కార్యకర్తలు

మోదీ, అంబానీకి మంచి స్నేహం ఉంది

అందుకే రాఫెల్‌ కాంట్రాక్టును రిలయన్స్‌కు ఇచ్చారు

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ.1,5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వానికి రైతులు తీసుకున్న రూ.5,000 అప్పును మాఫీ చేసేందుకు చేతులు రావడంలేదని విమర్శించారు. రాహుల్‌ సోమవారం భోపాల్‌లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. అంతకుముందు భోపాల్‌లోని లాల్‌ఘాటీ నుంచి బీహెచ్‌ఈఎల్‌ దసరా మైదాన్‌ వరకూ 15 కి.మీ మేర రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా భారీగా గూమిగూడిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ‘రాహుల్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు.

కాపలాదారు దొంగగా మారాడు..
ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల ఒప్పందంపై రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ఇదంతా మీ (ప్రజల) డబ్బే. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న వ్యక్తి(మోదీ) ఇప్పుడు ప్రజల సొమ్మును దొంగలించాడు. రాఫెల్‌ యుద్ధ విమానాలను రూ.700 కోట్లకు కాకుండా రూ.1,600 కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు కొంటున్నారని పార్లమెంటులో మోదీజీని నేను ప్రశ్నించాను. ప్రభుత్వరంగ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) నుంచి రాఫెల్‌ తయారీ కాంట్రాక్టును లాక్కుని రూ.45,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయిన అనిల్‌ అంబానీకి ఎందుకు అప్పగించారని ఆయన కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాను. కానీ మోదీ మాత్రం నా కళ్లలోకి చూడలేక చూపును పక్కకు తిప్పుకున్నారు. ఈ కాపలాదారుకు, అనిల్‌ అంబానీకి మంచి స్నేహం ఉంది. అందుకే రాఫెల్‌ కాంట్రాక్టును అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీకి అప్పగించారు’ అని రాహుల్‌ విమర్శించారు.

70 ఏళ్లలో జరగని స్కాం నాలుగేళ్లలో...
కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని రాహుల్‌ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ హయాంలో గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగని అతిపెద్ద కుంభకోణాన్ని పెద్దనోట్ల రద్దుతో ప్రధాని మోదీ నాలుగేళ్లలో చేసి చూపారని విమర్శించారు. చిరు వ్యాపారుల జేబుల నుంచి లాక్కున్న డబ్బును తన మిత్రులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకే మోదీ పెద్ద నోట్ల రద్దును చేపట్టారని ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి 1.5 లక్షల కోట్లను మాఫీ చేసిన ప్రభుత్వం కేవలం రూ.5,000 అప్పు కట్టలేని రైతులను ఎగవేతదారులుగా ముద్రవేస్తోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు