బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దళిత వ్యతిరేకులు

7 May, 2018 03:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దళిత వ్యతిరేక ఆలోచనా ధోరణి కలిగిన బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్‌లు.. సమాజంలో దళితులు అట్టడుగునే కొనసాగాలన్న ఫాసిస్ట్‌ భావజాలంతో ఉన్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన .. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల నేతల వ్యాఖ్యలు, కొన్ని ఘటనలతో కూడిన వీడియోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

రెండు నిమిషాల నిడివున్న ఆ వీడియోలో 2016లో గుజరాత్‌లో జరిగిన ఉనా ఘటన, మధ్యప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక సందర్భంగా అభ్యర్థుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాయటం వంటివి ఉన్నాయి. మోదీ పాలనలో దళితులు లెక్కలేనన్ని దురాగతాలకు బలవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా ఆయన కాపాడలేక పోయారని ఆరోపించారు. దేశంలో ప్రతి 12 నిమిషాలకో దళితుడు వేధింపులకు, రోజుకు ఆరుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారన్నారు.

>
మరిన్ని వార్తలు