ప్రధానిపై వ్యక్తిగత దాడికి దూరం..

3 May, 2018 17:48 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, బీదర్‌ : ప్రధాని నరేంద్ర మోదీపై తానెప్పుడూ వ్యక్తిగత దాడి చేయలేదని, ప్రధానిగా ఆయనను గౌరవిస్తానని..అయితే దేశాన్ని పీడించే అంశాలపై ఆయనను ప్రశ్నిస్తానని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. బీదర్‌ జిల్లాలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని తన గురించి ఏం మాట్లాడినా తాను మాత్రం దేశ ప్రధానిగా ఆయనపై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని..దేశానికి సంబంధించిన అంశాలపై మాత్రం ప్రశ్రాస్ర్తాలు సంధించేందుకు వెనుకాడనని అన్నారు.

ప్రధాని కాంగ్రెస్‌పై చేస్తున్న వ్యాఖ్యలను చౌకబారు ఎత్తుగడలుగా ఆయన కొట్టిపారేశారు. ప్రధానిగా ఆయన ఎలా అయినా మాట్లాడవచ్చు..అయితే ప్రధాని వ్యాఖ్యలు వాస్తవాలతో కూడుకున్నవిగా ఉండాలని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో ఆయన దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. పేద ప్రజల ఖాతాల్లో రూ 15 లక్షలు జమచేస్తానన్న ప్రధాని అలా చేశారా అని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలిస్తానన్న మోదీ ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. రైతులకు కనీస మద్దతు ధరపై హామీలిచ్చిన ప్రధాని ఆ హామీని అమలు చేయలేదన్నారు. ఆయన కేవలం తన చుట్టూఉండే కొద్దిమందికే సాయపడ్డారు. ప్రధాని రెడ్డి సోదరులకు ( జనార్థన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సోమశేఖర రెడ్డి) మాత్రమే ఊతమిచ్చి వారికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు