పథకాలు బాగు.. ‘కారు’ సారే కావాలి

7 Apr, 2019 08:05 IST|Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌ : ‘ప్రభుత్వ పథకాలు బాగున్నాయి.. వీటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది..’ ‘సంక్షేమ పథకాల అమలు బాగానే ఉంది.. అయితే, ఆ మేరకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ఏటా నిధుల శాతం పెంచాలి. అప్పుడే లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మారతాయి..’ ‘రైతుబంధు భేష్‌.. రైతుబీమా ఇంకా బాగుంది. అయితే, భూమి పట్టా సమస్యలున్నాయి. వీటిని కూడా పరిష్కరిస్తేనే రైతులందరూ సంతోషంగా ఉంటారు..’ ‘నిరంతర విద్యుత్, మిషన్‌ కాకతీయ పథకాలు గణనీయమైన మార్పు తెచ్చాయి. వ్యవసాయ రంగం స్థితిగతులనే మార్చేశాయి..’ ఇవీ ‘సాక్షి’ రోడ్డు షోలో వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు...

తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చిన ప్రజలు.. వాటిని నిరంతరం మెరుగుపరుస్తూ కొనసాగించాలని ఆకాంక్షించారు. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మద్దతునిస్తామని పలువురు ముక్తకంఠంతో చెప్పారు.

అయితే, బీజేపీ పెద్దనోట్ల రద్దుతో రోడ్డున పడ్డామని పలువురు వాపోయారు. తమ డబ్బులు తాము బ్యాంకుల నుంచి తీసుకోవడానికి కూడా నానాపాట్లు పడ్డామని గుర్తు చేసుకున్నారు. రేణుకా చౌదరి (కాంగ్రెస్‌), నామా నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్‌), వెంకట్‌ (సీపీఎం).. తలపడుతున్న ఖమ్మం లోక్‌సభ స్థానంలో జనం స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రాష్ట్ర సర్కారు పాలన ఎలా ఉంది? ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతునిస్తారు? కేంద్రంలో ఎవరు/ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, పుల్వామా దాడులతో సహా ఇంకా ఏయే అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు? అని ‘సాక్షి’ ప్రశ్నించగా, పలువురు భిన్నంగా స్పందించారు. 

అభివృద్ధికి బాటలు వేసుకుంటాం..
కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న రైతుబంధు, రుణమాఫీ, నిరంతర విద్యుత్, మిషన్‌ కాకతీయ పథకాలు బాగున్నాయని, వీటి వల్ల వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయని పలువురు చెప్పారు. ముసలిమడుగుకు చెందిన వ్యవసాయ కూలీ సీహెచ్‌.సెల్వరాజ్, తల్లాడకు చెందిన దినసరి కూలీ జి.  లక్ష్మణ్‌రావు, అన్నారుగూడెంకు చెందిన వ్యవసాయ కూలీ ఎస్‌.వెంకటేశ్వరరావు, రెడ్డిగూడెంకు చెందిన కౌలు రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘మిషన్‌ కాకతీయతో చెరువులు నిండాయి. దీంతో రైతులకే కాక మత్స్యకారులకూ ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన రోడ్డు షోలో ‘సాక్షి’ బృందం పలకరించిన వారిలో ఎక్కువ మంది ‘ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కడతామని, అభివృద్ధికి బాటలు వేసుకుంటా’మని చెప్పడం విశేషం. 

పెద్దనోట్ల రద్దుతో మస్తు తిప్పలాయె..
ఈ లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి కాముకులకే పట్టం కడతామని జనం అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, బ్యాంకు లావాదేవీల్లో నెలకొన్న సమస్యల కారణంగా బీజేపీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మోదీ హయాంలో శాంతిభద్రతల విషయంలో కొంతమేర బాగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ మాత్రం చిన్నాభిన్నమైందని, తాము తీవ్ర ఇబ్బందులపాలయ్యామని రైతులు చెప్పారు.

బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ము సమయానికి చేతికందక విసిగి పోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హయాంలో పాలన ఆశించినంత బాగా జరగలేదని కొంతమంది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు మాత్రం దేశంలోఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్‌గాంధీపై నమ్మకం లేదని కొందరు చెప్పగా, ఇంకొందరు మాత్రం కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే రావాలని, ప్రభుత్వం మారితే తప్ప సామన్యుడికి మేలు జరగదని అభిప్రాయపడ్డారు. 

ఎండిన పత్తి.. మిర్చి
‘సాక్షి’ బృందం ప్రయాణించిన వివిధ మార్గాల్లో భిన్న దృశ్యాలు కనిపించాయి. ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల, కొండాపురం, చింతపల్లి, తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెంలో ప్రధానంగా మిర్చి, పత్తి పొలాలు నీళ్లులేక ఎండిపోయిన దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఖమ్మం నుంచి వరంగల్‌ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఎక్కడ చూసినా ఎండిన చేలే కనిపించాయి. పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయామని తమను పలకరించిన రైతులు తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన సీతారామ పథకం ద్వారా సాగునీరు అందించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరారు.

సాగర్‌ జలాల ప్రభావం
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ప్రాంతం నాగార్జునసాగర్‌ రెండో జోన్‌ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం యాసంగి పంటకు సాగర్‌ జలాలు అందటం లేదు. దీంతో రైతులు ఒకింత అసహనంతో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక దఫా, సండ్ర వెంకటవీరయ్య మరో దఫా సాగర్‌ జలాలను విడుదల చేయించారు. దీంతో చివరి దశలో పంటలకు జీవం పోసినట్లయింది. ‘సాగర్‌ జలాల విడుదల అంశం ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుంది’ అని చెప్పాడు ఖమ్మం శివార్లలోని టేకులపల్లికి చెందిన చిలకల నారాయణ. ‘సాగర్‌ జలాలు అందిన కొందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అందని రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు’ అని ఆయన పరిస్థితిని వివరించారు. 

పాలన మస్తుంది..
కేసీఆర్‌ పాలనలో అధికారులు పనులు వెంటనే చేస్తున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. కేంద్రంలో మాత్రం మోదీ ప్రభుత్వమే రావాలి.
– టి.మురళి, దినసరి కార్మికుడు  

కేంద్రంలోనూ ‘కారే’ రావాలి..
చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే మాలాంటి వాళ్లకు కేసీఆర్‌ ఎంతో సహాయం చేస్తున్నారు. కేంద్రంలో కూడా కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ వస్తేనే బాగుంటుంది. అనుకున్న పనులను ఒత్తిడి తెచ్చి చేయించుకోవచ్చు. 
– షేక్‌ షమీన్, ఆరెంపుల

ఓట్లప్పుడే వచ్చుడు..
మా గురించి ఎవరూ పట్టించుకునే వారెవరూ లేరు. ఓట్ల సమయంలోనే ఉరుక్కుంటూ మా దగ్గరికి వస్తరు. ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తేనే మంచిది. కాంగ్రెస్‌ వస్తే కేంద్రంలో బాగుంటది.
– టి.వీరభద్రం, తిరుమలాయపాలెం 

కౌలు రైతులకు సాయం
టీఆర్‌ఎస్‌ సర్కారు అందిస్తున్న పెట్టుబడి సహాయంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా సహాయం చేయాలి. ఎక్కువ సీట్లు టీఆర్‌ఎస్‌కు వస్తే మంచిది.   
 – తోట సైదులు, తిరుమలాయపాలెం  

‘కారే’ రాబడతది..
దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ పాలనలో బ్యాంకుల ముందు బారులు తీరినం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గాలి వీస్తోంది. కేసీఆరే ఎక్కువ సీట్లు రాబడుతడు.
– మిడియం లక్ష్మయ్య, ఆనందపురం 

ఆ పార్టీకే మొగ్గు.. 
గతంలో ఎన్నికలప్పుడు తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇంతవరకూ పనులు చేపట్టలేదు. ఈ ప్రభావం అధికార పార్టీ మీద తప్పకుండా ఉంటుంది. ఖమ్మంలో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువ. కేంద్రంలో మాత్రం బీజేపీకే అవకాశం.    
– బి.రవి, వ్యాపారి.

అధికారం మూడో ఫ్రంట్‌దే
బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. బ్యాంక్‌లో దాచుకున్న డబ్బు సమయానికి చేతికి అందక విసిగిపోయాం. కేసీఆర్‌ చెబుతోన్న ఫెడరల్‌ ఫ్రంట్‌కే అవకాశం కనిపిస్తోంది. 
– జి.సోమేశ్వరరావు, పాల్వంచ.

అందరి సంతోషం కోసం..
అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలంటే... అది కాం గ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యం. బడుగు, బలహీన వర్గాల వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది. నేను కాంగ్రెస్‌కే మద్దతునిస్తా.           
– కొరదల సరస్వతి, మహిళా రైతు, సుజాతనగర్‌   

మరిన్ని వార్తలు