‘ఫతేపూర్‌’ బస్తీలో రాజ్‌బబ్బర్‌

18 Apr, 2019 04:39 IST|Sakshi
రాజ్‌బబ్బర్‌,రాజ్‌కుమార్‌ చాహర్‌, భగవాన్‌శర్మ

ఫతేపూర్‌ సిక్రీలో త్రిముఖ పోటీ

బీజేపీ, బీఎస్‌పీకి గట్టి పోటీనిస్తోన్న కాంగ్రెస్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్‌ బంధన్‌లో స్థానం దక్కని కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలుపు అవకాశాలున్న అతి కొద్ది సీట్లలో ఫతేపూర్‌ సిక్రీ ఒకటి. యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ బాలీవుడ్‌ నటుడైన రాజ్‌బబ్బర్‌ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో మొదటిసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ చేతిలో దాదాపు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అదే ఏడాది జరిగిన ఫిరోజాబాద్‌ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ను బబ్బర్‌ ఓడించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎస్పీలో ఉండగా ఆ పార్టీ తరఫున ఆగ్రా నుంచి 1999, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పునర్విభజనలో ఆగ్రా స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. ఆగ్రా జిల్లాలో సగ భాగం ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గం 2009లో ఏర్పాటయింది. 2014లో బీజేపీ అభ్యర్థి చౌధరీ బాబూలాల్‌ తన సమీప బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయను లక్షా 73 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు కాంగ్రెస్‌–ఆర్‌ఎల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన అమర్‌సింగ్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈసారి బాబూలాల్‌కు బీజేపీ టికెట్‌ దక్కలేదు. రాజ్‌కుమార్‌ చాహర్‌ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మహాగఠ్‌ బంధన్‌ తరఫున శ్రీభగవాన్‌ శర్మ అలియాస్‌ గుడ్డూ పండిత్‌ (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఆగ్రా నగరంలో పుట్టిన బబ్బర్‌ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

ఘజియాబాద్‌ వద్దన్న బబ్బర్‌..
రాజ్‌ బబ్బర్‌ను మొదట ఆయన కిందటిసారి ఓడిన ఘజియాబాద్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. బబ్బర్‌ మద్దతుదారులతో పాటు ఆయన కూడా అక్కడి నుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో చివరికి ఫతేపూర్‌ సిక్రీ టికెట్‌ కేటాయించారు. ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో రాజ్‌బబ్బర్‌ కులానికి (విశ్వకర్మ) చెందిన జనం బాగా తక్కువ. తనను చూసి అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలంతా తన కులస్తులేనని, బంధువులని బబ్బర్‌ ఓ సందర్భంలో చమత్కరించారు. బాలీవుడ్‌ నటునిగా జనంతో ఉన్న పాత సంబంధం, స్థానికునిగా ఉన్న గుర్తింపు తనకు చాలని ఆయన భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఠాకూర్లు, బ్రాహ్మణుల తర్వాత జాట్ల జనాభా ఎక్కువ. బీజేపీ అభ్యర్థి చాహర్‌ జాట్‌. బీఎస్పీ నేత గుడ్డూ పండిత్‌ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనాభా రీత్యా ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నా ఈ వర్గం అభ్యర్థులెవరూ బరిలో లేరు. బీఎస్పీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సూరజ్‌పాల్‌ సింగ్, ధరమ్‌పాల్‌ సింగ్‌ (ఇద్దరూ ఠాకూర్లే) ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో రాజ్‌ బబ్బర్‌ ప్రచారం ఊపందుకుంది.

మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ అభ్యర్థి భారం
బీజేపీకి లోక్‌సభ అభ్యర్థిని చూసి తాము ఓట్లేయడం లేదనీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల విధానాల కారణంగానే కాషాయ పక్షాన్ని గెలిపిస్తున్నామనే అభిప్రాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి చాహర్‌ గతంలో సిక్రీ నుంచి అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. బబ్బర్‌ అనుచరునిగా పనిచేసిన నేపథ్యం కూడా చాహర్‌కు ఉంది. అయినా, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నరేంద్రమోదీ ముఖం చూసి ఓటేసే వారి సంఖ్య యూపీలో గణనీయంగా ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

బీఎస్పీకి దూరమైన బ్రాహ్మణ ఓటర్లు?
బ్రాహ్మణ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న సీమా ఉపాధ్యాయకు బీఎస్పీ టికెట్‌ ఇవ్వలేదు. ఆమె పార్టీ టికెట్‌పై 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఆమె వర్గానికే చెందిన గుడ్డూ పండిత్‌కు బీఎస్పీ టికెట్‌ లభించింది. స్థానికేతురుడైన బులంద్‌శహర్‌ ఎమ్మెల్యే పండిత్‌కు మద్దతు ఇవ్వడానికి బ్రాహ్మణులు ఆసక్తి చూపడం లేదు. మాయావతి కులమైన జాటవులు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి తరఫున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచి పేరు లేకపోవడం బబ్బర్‌కు అనుకూలాంశంగా మారింది. ఎస్పీకి చెందిన కొందరు బ్రాహ్మణ నేతలు బబ్బర్‌ తరఫున ప్రచారం చేయడంతో పోటీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చాహర్, బబ్బర్‌ మధ్యనే ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు