ఏదో ఆవేశంలో అలా మాట్లాడా: కోమటిరెడ్డి

26 Sep, 2018 19:13 IST|Sakshi

సాక్షి, నల్గొండ : ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలను పట్టుకొని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. క్రమశిక్షణ సంఘం, పార్టీ హైకమాండ్‌లు ఏ చర్య తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీలను రాష్ట్ర నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, ఇటువంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలుగుతుందన్నారు.  టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఎన్నోకేసులు పెట్టి వేధించారని, అయినా పార్టీ కోసం కార్యకర్తలు.. తను కష్టపడుతున్నామని పేర్కొన్నారు. మునుగోడు నుంచి పోటీచేయమని అక్కడి ప్రజలు కోరుతున్నారని, ఇక్కడ సీటిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతానన్నారు. ప్రతి ఎమ్మెల్యే సీటు ముఖ్యమేనని, గెలిచే అభ్యర్థులకే టికెట్‌ ఇవ్వాలన్నారు. తొలి షోకాజ్‌ నోటీసుకే సమాధానం ఇచ్చానని, రెండోసారి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను ఉద్దేశించి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని ఆయనకు ఈ నెల 21న షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసుకు రాజగోపాల్‌ ఇచ్చిన సమాధానంపై కమిటీ సంతృప్తి చెందలేదు. దీంతో మరో షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన ఈ నోటీసుకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి సమాధానం కోసం వేచి చూడాలని క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆ తర్వాతే చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు