‘ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర’

12 Jul, 2020 05:58 IST|Sakshi
రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్

జైపూర్‌: రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ శాసనసభ్యులకు 15 కోట్లరూపాయలు ఆశచూపి, వారిని డబ్బుతో కొనేయాలని చూస్తోందని ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే తమ ప్రభుత్వం స్థిరంగా ఉండడం మాత్రమే కాదనీ, తమ ప్రభుత్వం ఐదేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా తన ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నారనీ, అందుకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని గహ్లోత్‌ ఆరోపించారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే బీజేపీ నాయకులు గేమ్‌ ఆడుతున్నారన్నారు. అడ్వాన్స్‌గా రూ.10 కోట్లను, ప్రభుత్వాన్ని కూల్చాక మరో రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి తమ శాసనసభ్యులను కొనేయత్నం చేశారని గహ్లోత్‌ అన్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలను ‘మేకల మండీ’లా భావిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు గులాబ్‌ చంద్‌ కటారియా, రాజేంద్ర రాథోడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పునియాలు కేంద్ర నాయకత్వ ఎజెండాను అమలు చేస్తున్నారంటూ గహ్లోత్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు