అర్థమయ్యేలా చెప్పడానికో పథకం!

5 Nov, 2018 03:18 IST|Sakshi

రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండంటే రెండే నెలల్లో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తామని  కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వాగ్దానం చేశారు. రాజస్తాన్‌ ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న జవదేకర్‌.. జైపూర్‌లోని ఓ మురికివాడలోని ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో ఓ బామ్మ, తాతయ్య దగ్గరికెళ్లి.. ‘బీజేపీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అడిగారు. దీనికి అటు, ఇటూగా వారు సమాధానం చెప్పడంతో ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని అందించారు.

అయితే ‘అయ్యా! మేం చదువుకోలేదు. ఇందులో ఏముందో మాకు అర్థం కాదు’అని వాళ్లు సమాధానమిచ్చారు. దీనికి ఒక్క క్షణం ఆలోచించిన జవదేకర్‌ అక్కడున్న వాళ్ల మనవడు, మనవరాలిని పిలిచి.. నానమ్మ, తాతలకు చదవటం నేర్పించాలని సూచించారు. ‘బడికెళ్తున్న చిన్నారులు.. సమయం దొరికినపుడల్లా నిరక్షరాస్యులైన మీ పెద్దలకు చదువు నేర్చించాలి’అని సూచించారు. ఇందుకోసం రెండు నెలల్లో ఓ పథకాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు. పెద్దలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  


అక్కడ నీటి కొరతే ప్రతిపక్షం
రాజస్తాన్‌లో అజ్మీర్‌ నగరంలో రెండ్రోజులకోసారి నల్లా నీళ్లొస్తాయి. అదీ అరగంట సేపే. అజ్మీర్ల్‌ వాసులు.. ఇలా రెండ్రోజులకోసారి నీళ్లు పొందడమే ఓ వైభోగం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్దగా నదుల్లేవు. ఉన్న చిన్నా చితకా వాగులు కూడా ఎప్పుడూ ఎండిపోయే ఉంటాయి. నీటికొరత తీర్చేందుకు ఏ ప్రభుత్వం దీర్ఘకాల కార్యాచరణతో పనిచేయలేదు. ఈసారి కొరత గతంలో కన్నా తీవ్రంగా ఉండటంతో.. నీటికొరతే ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షంగా మారనుంది.

2009లో ఇలాగే తీవ్ర దుర్భిక్షం ఎదురైనపుడు పౌర, కార్మిక సంఘాలు, మార్కెట్‌ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘నీరివ్వకుంటే ఓటేయబోం’అని ఉద్యమాన్ని లేవనెత్తాయి. ఇది నాటి వసుంధరా రాజే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అజ్మీర్‌ తాగునీటి అవసరాల కోసమే బీసల్‌పూర్‌ డ్యామ్‌ కట్టారు. కానీ ప్రభుత్వం.. రాజకీయ అవసరాల కోసం ఈ నీటిని టోంక్, జైపూర్‌ నగరాలకు తరలించడం కారణంగానే ఇక్కడ కరువు ఏర్పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు.  

ఎన్నికల వేళ దర్గా దర్శనం
రాజస్తాన్‌లోని మార్వార్‌ ప్రాంతం పేరు చెబితే బంజరు భూములు, వడగాలులు గుర్తొస్తాయి. కానీ ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు సూఫీ సంస్కృతికి, సాధువులకు అడ్డాగా ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా నాగౌర్‌లోని 13వ శతాబ్దంనాటి ఖాజీ హమీదుద్దీన్‌ దర్గా చాలా ఫేమస్‌.

ఇక్కడికి స్థానికంగా ఉండే ఆలయాల పూజారులు సహా అన్ని మతాలను విశ్వసించేవారు వస్తారు. ఎన్నికల సమయంలోనైతే ఈ దర్గా కు వచ్చి దర్శనం చేసుకోని పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు ఉండరనే చెప్పాలి. సుఫీ బాబా పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులందరూ క్యూ కడతారు. అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాలాగా దీనికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కకపోయినా, ఎన్నికలప్పుడు మాత్రం బాగా సందడి ఉంటుంది. సుఫీ గురువైన ఖాజీ హమీదుద్దీన్‌ వెజిటేరియన్‌గానే జీవితం గడిపారని ఈ దర్గా సంరక్షకులు చెబుతారు.

మరిన్ని వార్తలు