ఈ సారి సహారియాల ఓటు ఎవరికి ?

5 Dec, 2018 17:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 72 మంది ఆకలితో చనిపోయారనే వార్త 2002లో జాతీయ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వారిలో 47 మంది ఒక్క రాజస్థాన్‌లోని కిషాన్‌గంజ్‌ సమితిలోనే చనిపోవడం గమనార్హం. వారంతా కూడా సహారియా తెగకు చెందిన వారే కావడం మరింత గమనార్హం. ఈ ఆకలి చావులకు వ్యతిరేకంగా నాడు సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పర్యావసానంగానే 2006లో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌)’, 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చాయి.

కిషన్‌గంజ్‌ నియోజకవర్గంలోని ధిక్వాణి, రతాయి, ఖైరాయ్‌ గ్రామాల్లో సహారియాలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం రాజస్థాన్‌ రాష్ట్ర జనాభాలోనే 40 శాతం ఉన్న సహారియాలను షెడ్యూల్డ్‌ తెగల కింద గుర్తిస్తున్నారు. వారికి ఈ కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1985లోనే కేటాయించారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో నివసిస్తూ అటవి ఉత్పత్తులపై ఆధారపడి బతికిన సహారియాలు అడవులు ధ్వంసమవడం, పలచపడడం తదితర కారణాల వల్ల మైదాన ప్రాంతాల్లోకి వచ్చిపడ్డారు. అక్షరాస్యత ఏమాత్రంలేని వీరంతా కూలినాలి చేసుకుని బతికేవారే. చాలాకాలం వీరు భూస్వాముల వద్ద, ధనిక రైతుల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బతికారు. ఆ చాకిరి నుంచి వీరికి విముక్తి కల్పించిందీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి కనీసం వంద రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యం.

ఈ పథకం కింద ఏడాది క్రితం తాను 24 రోజులు పనిచేశానని, వాటికి కూలీ నేటి వరకు రాలేదని బరన్‌ జిల్లాలోని ధిక్వాని గ్రామానికి చెందిన కమలేష్‌ భాయ్‌ తెలిపారు. ఈ ఎన్నికలలోగానైనా కూలీ డబ్బులు వస్తాయని ఆశించానని, రాలేదని ఆమె చెప్పారు. డబ్బులు రాకపోతే ఆకిలితో చావడమో, వెట్టి చాకిరికి వెళ్లిపోవడమో తప్పేట్లు లేదని ఆమె వాపోయారు. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి హామీ పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, అప్పుడు తనతోపాటు ఎన్నో కుటుంబాలు భూస్వాముల వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందామని ఆమె తెలిపారు. మూడేళ్లుగానే నిధులు లేవంటూ ఆమె సతాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.


ఆమె ఆరోపణలతో మిగతా గ్రామాల ప్రజలు కూడా ఏకీభవించారు. ‘ఉపాధి హామీ పథకం మా జీవనాధారం’ అని రతాయ్‌ గ్రామానికి చెందిన అనితా సహారియా వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఈ పథకం ఎందుకనో సవ్యంగా అమలు జరగడం లేదని ఆమె విమర్శించారు. 2008–10 సంవత్సరాలతో పోలిస్తే వంద రోజులు పని పొందిన వారి సంఖ్య పదింటిలో ఒకటికి పడిపోయినట్లు అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ప్రజా పంపిణీ పథకం కింద తమకు రేషన్‌ సరుకులు కూడా సరిగ్గా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆధార్‌కార్డులతో అనుసంధానించిన రేషన్‌ మిషన్లు తమ వేలి ముద్రలను గుర్తించక పోవడం వల్ల డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తనకు మూడంటే మూడుసార్లు మాత్రమే రేషన్‌ ఇచ్చారని, వేలి ముద్రలను యంత్రం గుర్తించకపోయినా డీలరు దయతలచి మూడు సార్లు ఇచ్చారని 72 ఏళ్ల హల్కీ భాయ్‌ తెలిపారు. రేషన్‌ సరుకులు అందక పేద ప్రజలు దీపావళి రోజున కూడా పస్తులున్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఆ వారంతో సెప్టెంబర్, అక్టోబర్‌ రేషన్‌ కోటాను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇక కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్‌ పథకాలేవి తమకు అందుబాటులోకి రాలేదని కిషన్‌గంజ్‌ నియోజకవర్గం పరిధిలోని సహారియాలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మంత్రి ఆవాస్‌ కింద తమ లబ్దిదారుడికి ఒకే ఒక ఇల్లు మంజూరయిందని, మొత్తం ఇంటికి 1.40 లక్షల రూపాయలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం మొదటి విడతగా 52 వేల రూపాయలను మాత్రమే విడుదల చేశారని, దాంతో పైకప్పు నిర్మించకుండా వదిలేశారని బాధితుడు తెలిపారు. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు అన్యాయంగా ఇళ్లను మంజూరు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఇక ఉజ్వల పథకం కింద ఉచితంగా మంజూరైన గ్యాస్‌ కనెక్షన్‌ను మొదటి సిలిండర్‌ అయిపోగానే మూలన పడేశామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. సిలిండర్‌ రీఫిల్లింగ్‌కు వెయ్యి రూపాయలను తాము ఎక్కడి నుంచి కడతామని వారంటున్నారు. అక్కడక్కడ అధ్వాన్నంగా కట్టిన మరుగుదొడ్లు కూడా మూలన పడ్డాయని వారు ఆరోపించారు. ఈసారి ఎవరికి ఓటేస్తారని వారిని ప్రశ్నించగా, ఎప్పటిలాగా కాంగ్రెస్‌కే ఓటేస్తామని వారు చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా ప్రస్తుత ప్రభుత్వం తమను ఏనాడు పట్టించుకోలేని వారు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున హీరాలాల్‌ సహారియా, బీజేపీ తరఫున హేమ్‌రాజ్‌ మీనా కుటుంబాలే మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన ఈ కిషన్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ  పడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిర్మలా సహారియా పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున లిలిత్‌ మీనాలు పోటీ చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు