అల్లర్లతో కలత చెందాను: రజనీకాంత్‌

20 Dec, 2019 10:45 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఎట్టకేలకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. దేశంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. పౌరులందరూ శాంతియుతంగా, కలిసికట్టుగా ఉండాలని కోరారు. హింసాకాండతో సమస్యలు సమసిపోవని ఆయన హితవు పలికారు. దేశంలో జరుగుతున్న అల్లర్లపై తీవ్రంగా కలత చెందానన్నారు.

అయితే రజనీకాంత్‌ సీఏఏను ఆమోదిస్తున్నట్టు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇక రజనీ ట్వీట్‌పై ఆయన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘శాంతి మార్గంలో పోరాడుదాం’ అని కొందరు ఆయన మాటలతో ఏకీభవిస్తుండగా, ‘నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా రజనీ వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు మక్కల్‌ నీది మయ్యం(ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ సీఏఏ అమలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

>
మరిన్ని వార్తలు