మా మధ్య చిచ్చు పెట్టొద్దు

10 Apr, 2019 12:00 IST|Sakshi
మీడియాతోమాట్లాడుతున్న రజనీకాంత్‌

కమల్‌కు మద్దతు విషయంగా తలైవా వ్యాఖ్య

నదుల అనుసంధానానికి ఆహ్వానం

బీజేపీ మేనిఫెస్టోలోని పై అంశానికి కితాబు

అధికారంలోకి వస్తే తొలి కర్తవ్యంగా భావించాలని వేడుకోలు...

సాక్షి, చెన్నై: స్నేహితుల మధ్య చిచ్చు పెట్ట వద్దు అని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విజ్ఞప్తి చేశారు. కమల్, తాను మంచి స్నేహితులం అని, ఇందులో రాజకీయ చిచ్చు రగిల్చే రీతిలో ప్రయత్నాలు చేయవద్దు అని మీడియాను కోరారు. ఇక, నదుల అనుసంధానం గురించి బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని ఆహ్వానిస్తూ కితాబు ఇచ్చారు. అధికారంలోకి వస్తే, తొలి కర్తవ్యంగా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలన్నారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలైవా రాజనీకాంత్‌ తన అభిమానుల్ని ఏకం చేసి రజనీ మక్కల్‌ మండ్రంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ ఇప్పట్లో లేదంటూ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ వివాదాల్లోకి వెళ్లకుండా, కేవలం సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇటీవల రజనీ మక్కల్‌ మండ్రం నిర్వాహకులతో సమాలోచన సమయంతో ఈ ఎన్నికల్లో తన మద్దతు ఎవ్వరికీ లేదని తలైవా స్పష్టం చేశారు. అలాగే, నదుల అనుసంధానం, నీటికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఓటు వేయాలన్నట్టుగా స్పందించారని చెప్పవచ్చు.  ఈ పరిస్థితుల్లో మంగళవారం తలైవా కొత్త చిత్రం పోస్టర్‌ తెరపైకి వచ్చింది. దర్బార్‌ పేరిట ఆ పోస్టర్‌ను దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ప్రకటించారు. ఈ పోస్టర్‌ తెరపైకి వచ్చిన కొన్ని గంటల్లో పోయెస్‌గార్డెన్‌లో మీడియా ముందుకు రజనీకాంత్‌ వచ్చారు. రాజకీయంగా ఇప్పటికే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన్నట్టు ప్రకటించిన రజనీకాంత్‌ నదుల అనుసంధానికి బీజేపీ మేనిఫెస్టోలో చోటు కల్పించి ఉండడాన్ని ఆహ్వానించారు.

నదుల అనుసంధానంతో సుభిక్షం..
మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తమరి మద్దతును ఆశిస్తున్నట్టుందే అని మీడియా ప్రశ్నకు తొలుత రజనీకాంత్‌ సమాధానం ఇచ్చారు. రాజకీయంగా తమ నిర్ణయాన్ని ఇప్పటికే స్పష్టం చేసి ఉన్నామన్నారు. ఎన్నికల సమయం ఇది అని, ఇప్పుడు ఇలాంటివి వద్దు అని వారించారు. అలాగే, తాను, కమల్‌ మంచి స్నేహితులం అని, ఈ సమయంలో తమ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించవద్దు అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో నదుల అనుసంధానం అంశం గురించి ప్రస్తావించగా, ఆహ్వానించారు. గతంలో వాజ్‌ పేయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన్ను తాను కలిశానన్నారు. నదుల అనుసంధానం గురించి ప్రస్తావిస్తూ, ఈ పథకానికి భగీరథ్‌ యోజన అన్న పేరు పెట్టాలని సూచించగా, ఆయన ఆసక్తిగా వినడమే కాదు, చిరునవ్వులు చిందించారని గుర్తు చేశారు. భగీరథ్‌ యోజన అంటే, సాధ్యం కాని దానిని కూడా సాధించవచ్చు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో నదుల అనుసంధానం, అందుకు తగ్గ ఓ కమిషన్‌ ఏర్పాటు విషయం ప్రస్తావించడాన్ని ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. నదుల అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే, కరువు, పేదరికం తగ్గుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని , అన్నదాతల జీవితాల్లో వెలుగు నింపుతాయని వివరించారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చెప్ప లేమంటూ, ఒక వేళ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన పక్షంలో తొలి కర్తవ్యంగా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలని తాను విజ్ఞప్తి చేసుకుంటున్నానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు