ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్‌

6 Mar, 2020 07:52 IST|Sakshi
మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శులతో మాట్లాడుతున్న రజని

మీడియాతో రజనీకాంత్‌ ఆవేదన 

గెలుపోటములపై నివేదిక ఇవ్వండి 

అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలి 

పార్టీ ఊసేలేకుండా ముగిసిన కార్యదర్శుల సమావేశం 

అభిమానుల్లో అసంతృప్తి 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఒక విషయంలో మోసపోయా’నని అన్నారు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో గురువారం ఉదయం రజనీ మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ విషయంలో తాను మోసపోయానని అనడం చర్చనీయాంశమైంది. 

పార్టీ ఏర్పాటుపై రాని స్పష్టత 
రాజకీయ అరంగేట్రం చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తానని 2017 డిసెంబర్‌లో అభిమానుల నడుమ రజనీకాంత్‌ బహిరంగంగా ప్రకటించారు. అయితే రెండేళ్లుగా పార్టీని స్థాపించకున్నా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తూత్తుకూడి కాల్పులు, పౌరహక్కుల చట్టం సవరణపై అభిప్రాయాన్ని వెలిబుచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. రజనీ విమర్శలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అదే సమయంలో తనపై కాషాయం రంగు పులిమే ప్రయత్నాలు సాగుతున్నాయి, అది ఎంతమాత్రం కుదరదని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రజనీ ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి రజనీకాంత్‌ సొంతపార్టీని స్థాపించి ఒంటరిపోరుకు దిగుతారా, కమల్‌తో కలిసిపోతారా? అనేది వెయ్యిడాలర్ల ప్రశ్నగా మారింది. చదవండి: కమల్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ముమ్మరం
 
గెలుపోటములపై చర్చ.. 
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగితే పార్టీ హిట్టా..ఫట్టా..అధికారంలోకి వస్తామా? తదితర వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా మన్రం నిర్వాహకులను సమావేశంలో రజనీ కోరినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇతర పార్టీల బలాలు? గెలిచే అభ్యర్థులు? కమల్‌ పార్టీతో జత కడితే లాభమా, నష్టమా? ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా?..తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రజనీకాంత్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తంకండి, ఎన్నికలు ఎçప్పుడు వచ్చినా ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీలతో కూటమి జోలికి పోకుండా ఒంటరిపోరే మంచిదని కార్యదర్శులు రజనీకి సూచించినట్లు సమాచారం. సమావేశం అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. ఏడాది

తరువాత రజనీ మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమై అనేక విషయాలపై చర్చించానని అన్నారు. ఈ సమావేశం తనకు, కార్యదర్శులకు సంతృప్తినిచ్చిందని అన్నారు. ముస్లిం పెద్దలతో తాను ఇటీవల భేటీ అయ్యానని అన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నానని.. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాలను కలుసుకుని చట్టంలో మార్పుల గురించి వారికి వివరించాలని సూచించాని తెలిపారు. మోదీ, అమిత్‌షాలను కలుసుకునేందుకు సహాయం చేస్తానని వారికి చెప్పానన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత తన వల్ల తొలగిపోతుందా? కమల్‌తో కూటమి ఉంటుందా అనే ప్రశ్నలకు కాలమే బదులు చెబుతుందని చెప్పారు. చదవండి: శభాష్‌ మిత్రమా రజనీకాంత్‌: కమల్‌హాసన్‌

ఒక విషయంలో మోసపోయాను 
సమావేశానికి సంబంధించి ఒక విషయంలో తాను మోసపోయానని ఈ సందర్భంగా రజనీకాంత్‌ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమిటో తర్వాత చెబుతానని అన్నారు. రజనీ మక్కల్‌ మన్రం కార్యకలాపాలు బయటకు పొక్కడమే రజనీ అసంతృప్తికి కారణమని సమాచారం. ఈనెల 5న కార్యదర్శులతో జరిపే సమావేశానికి హాజరుకావాల్సిందిగా రజనీకాంత్‌ స్వయంగా వారందరికీ ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితమే రజనీ సమావేశంపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రజనీ ఇల్లు, కల్యాణమండపం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు వచ్చేశారు. “మీకు వ్యక్తిగతంగా ఫోన్‌లో ఇచ్చిన సమాచారం మీడియా దృష్టికి ఎలా వెళ్లింది, అంతమాత్రం గోప్యం పాటించకపోతే ఎలా’ అంటూ కార్యదర్శుల ముందు రజనీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పార్టీలో ముఠాతగాదాలు, వర్గపోరాటాలను ఎంతమాత్రం సహించను, అలాంటి వారు ఎవరైనా ఉంటే వైదొలగిపోండని ఒక సమావేశంలో రజనీ హెచ్చరించారు. అయితే గురువారం నాటి సమావేశానికి హాజరయ్యే సందర్భంలోనూ కొందరు వర్గపోరును కొనసాగించడం రజనీదృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మన్రం నిర్వాహకుల్లోని విబేధాలు పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని రజనీ ఆందోళన చెందడం వల్లనే “మోసపోయాను’ అని చెప్పినట్లు ఊహిస్తున్నారు. పార్టీ ఏర్పాట్లకు సంబంధించి అంతర్గత విషయాలు, రాజకీయ ప్రవేశం ప్రకటించగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా రజనీ ఆదేశించారు.

సుమారు 66 వేల బూత్‌ కమిటీలు, ఒక కోటికిపైగా సభ్యత్వం పూర్తయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఒక సందర్భంలో రజనీ సైతం ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే ఆ తరువాత సభ్యులు, బూత్‌ కమిటీల జాబితాను పరిశీలించగా నకిలీ సభ్యుల వ్యహారం బయటపడింది.  పార్టీలో పదవుల కోసం కొందరు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు రజనీకాంత్‌ తెలుసుకున్నారు. ఈ నకిలీ సభ్యుల చేరిక పనులను మనసులో పెట్టుకునే “మోసపోయాను’ అని వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు.     
నిరాశపడిన అభిమానులు 

రజనీ మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపానికి ఉదయం 10.25 గంటలకు రజనీ చేరుకోగా పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్న అభిమానులు “తలైవా తలైవా’ అంటూ నినాదాలు చేశారు. కారులో నుంచే వారికి అభివాదం చేస్తూ లోనికి వెళ్లిపోయారు. రాష్ట్రం నలుమూలల నుంచి 37 మంది కార్యదర్శులు హాజరుకాగా వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న తరువాతనే సమావేశం హాలులోకి పంపారు. కల్యాణమండపం వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. సుమారు గంటన్నరపాటు రజనీ సమావేశమయ్యారు.  

మరిన్ని వార్తలు