రజని ‘రూల్స్‌’

29 Aug, 2018 11:33 IST|Sakshi

పుస్తకం రూపంలో విడుదల

కుటుంబంలో ఒకరికి ఒక పదవి

త్వరలో చానల్, పత్రిక రాష్ట్ర పర్యటనకు కార్యాచరణ

రాజకీయ ప్రకటనతో నాయకుడిగా అవతరించిన కథానాయకుడు రజనీకాంత్‌ తన మక్కల్‌ మండ్రంకు ప్రత్యేక నియమ నిబంధనల్ని రూపొందించారు. మక్కల్‌ మండ్రంలో నిర్వాహకులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, క్రమశిక్షణ కల్గిన రక్షకుల వలే ఎలా మెలగాలి వివరిస్తూ కఠిన నిబంధనల్ని పుస్తకం రూపంలో మంగళవారం విడుదల చేశారు. అలాగే, త్వరలో ఓ టీవీ చానల్, పత్రిక ఏర్పాటుతో రాష్ట్ర పర్యటనకు సిద్ధం అవుతున్నారు.

సాక్షి, చెన్నై : 2017 డిసెంబరు 31వ తేదీ కథానాయకుడు రాజకీయ ప్రకటనతో నాయకుడిగా అవతరించారు. తమిళనాడు పరిరక్షణకు రక్షకులుగా నిలబడుదామని అభిమాన సేనలకు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. రజనీ రాజకీయ ప్రకటనతో తమిళనాట ఆహ్వానాలు, వ్యతిరేక చర్చ జోరుగానే సాగింది. అయితే, వీటన్నింటిని లెక్క చేయని తలైవా పార్టీ కసరత్తుల దృష్టి పెట్టారు. తన సన్నిహిత మిత్రులు, మేధావులతో మంతనాల్లో నిమగ్నం అయ్యారు. అయితే, రాజకీయ పార్టీ ప్రకటనలో మాత్రం జాప్యం తప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు పార్టీ అని స్పందిస్తూ వచ్చిన రజనీకాంత్, తన అభిమాన సంఘాల్ని ఏకంచేసి రజనీ మక్కల్‌ మండ్రాన్ని నెలకొల్పడంలో సఫలీకృతులయ్యారు. రజనీ మక్కల్‌ మండ్రంకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నిర్వాహకుల్ని ఏర్పాటుచేశారు. ఇందులో ఎవరి మీదైనా సరే చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా తక్షణం ఉద్వాసన పలికి మరొకరికి అవకాశం కల్పిస్తున్నారు. రజనీ మక్కల్‌ మండ్రం తమిళనాడుకు రక్షకులుగా నిలబడాలన్న కాంక్షతో నిబంధనల్ని కఠినత్వం చేస్తూ కీలక నిర్ణయాలను తాజాగా తీసుకున్నారు. రజనీ మక్కల్‌ మండ్రం నియమ నిబంధనల్ని ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఇందులో అనేక కీలక, కఠిన అంశాలను పొందుపరిచారు. రక్షకులు ఎలా ఉండాలో చాటడంతో పాటు, అందుకు సిద్ధపడే వాళ్లు ఎలా తమను తాము మలచుకోవాలో వివరిస్తూ అంశాల్ని వివరించారు.

నిబంధనలు
మక్కల్‌ మండ్రం నిబంధనలతో కూడిన పుస్తకాలను నిర్వాహకులకు పంపిణీ చేశారు. అందులోని కొన్ని నిబంధనలు.. మక్కల్‌ మండ్రం నిర్వాహకులు ఇతరులకు ఆదర్శంగా ఉండే రీతిలో  మెలగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చిన్న తప్పుచేసినా, అది మండ్రం మీద ప్రభావం పడుతుంది కాబట్టి, అలాంటి వారిని ప్రోత్సహించకుండా, తక్షణం ఉద్వాసన పలకడం లక్ష్యంగా కొన్ని అంశాలను పొందుపరిచారు. అలాగే, ఒక కుటుంబానికి చెందిన వాళ్లు మక్కల్‌ మండ్రంలో ఏదేని పదవిలో ఉన్న పక్షంలో, ఆ కుటుంబానికి చెందిన మరకొరికి పదవులు కేటాయించే ప్రసక్తేలేదు. మత, కుల, తదితర సంఘాల్లో సభ్యులుగా ఉన్న వాళ్లకు రజనీ మక్కల్‌ మండ్రంలో చోటు లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్న పక్షంలో వారంతకు వారే బయటకు వెళ్లడం మంచిది. లేదా ఉద్వాసన పలకడం త«థ్యం.  యువజన విభాగంలో 35 ఏళ్ల వయస్సులోపు వారికి మాత్రమే చోటు. 18 సంవత్సరాల  వయసు దాటిన వాళ్లు ఎవరైనా మండ్రంలో సభ్యులుగా చేరవచ్చు. మక్కల్‌ మండ్రం జెండాను ఎల్లప్పుడు ఉపయోగించేందుకు వీలు లేదు. ప్రధానంగా వాహనాల్లో ఉపయోగించకుండా ఆంక్షలువిధించారు. మక్కల్‌ మండ్రం కార్యక్రమాల సమయంలో మాత్రమే ఉపయోగించి, ఆ తదుపరి వాటిని తీసివేయాలి. మహిళల్ని గౌరవించడం, భారత దేశ చట్టాలను గౌరవించాలి. వ్యక్తిగత విమర్శలకు చోటులేదు. పార్టీ నుంచి లఖిత పూర్వకంగా వచ్చే ప్రకటనలు, ఇతర వివరాల మేరకు నడచుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీలు లేదు. పార్టీ ఆదేశించకుండా ఎలాంటి విరాళాల్ని సేకరించకూడదు. ఇతరుల్ని హేళనచేసే రీతిలో సామాజిక మాధ్యమాల్లో స్పందించరాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రీతిలో నడుచుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగానే మక్కల్‌ మండ్రం నిర్వాహకుల ఎంపిక ఎన్నికలు జరిగే రీతిలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలి. మార్పులు చేర్పులు, ఉద్వాసనలు, చర్యల విషయాల్లో అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనంటూ అనేక నిబంధనల్ని అందులో పొందుపరిచారు.

మీడియా వైపు చూపు
మక్కల్‌ మండ్రం పటిష్టత మీద దృష్టి పెట్టిన రజనీ, అదే తరహాలో బూత్‌ కమిటీల ఎంపికలోనూ నిమగ్నం అయ్యారు. ఒక బూత్‌కు 30 మంది చొప్పున కమిటీల ఏర్పాటు కసరత్తుల్ని వేగవంతం చేశారు. కొన్నిచోట్ల బూత్‌ కమిటీలకు పుష్కలంగా మద్దతుదారులు ఉన్నా, మరికొన్నిచోట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో కష్టాలు తప్పడం లేదు. దీన్ని పరిగణించి ఆయా ప్రాంతాల్లో మక్కల్‌మండ్రం నిర్వాహకుల ద్వారా కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి సిద్ధం అయ్యారు. అలాగే, పార్టీ ఏర్పాటుకు ముందుగా తమ కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలంటే, మీడియా మద్దతు తప్పనిసరిగా భావించారు. ఇందుకోసం ఓ టీవీ చానల్‌ మీద దృష్టి పెట్టారు.

తన సన్నిహితునికి సంబంధించిన ఓ టీవీ చానల్‌కు మంచి గుర్తింపు ఒకప్పుడు ఉన్నా, ఇప్పుడు  ప్రజాదరణ లేక సతమతం అవుతుండడాన్ని పరిగణించి, దానిని తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే, ఓ పత్రికను నెలకొల్పడమా లేదా, కష్టాలు, నష్టాల్లో ఉన్న పరిశ్రమను తమ ఆధీనంలోకి తీసుకోవడమా..? అన్న దిశగా కూడా రజనీ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రక్రియలన్నీ త్వరితగతిన ముగిసిన పక్షంలో, ఆ తదుపరి రాష్ట్ర పర్యటనకు సన్నద్ధం కానున్నారు. ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణను మక్కల్‌ మండ్రం రాష్ట్ర నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు