‘రజనీకాంత్‌కు రాజకీయ పరిపక్వత లేదు’

14 Aug, 2018 18:30 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై విమర్శలు చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై అన్నాడీఎంకే మండిపడింది. పార్ట్‌ టైం నేత స్థాయి నుంచి పుల్‌ టైం రాజకీయ నాయకుడిగా మారడానికి  ఓ సంతాప సభను ఉపయోగించు కున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.  సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నాడీఎంకే సీనియర్ నేత,  రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
 
కాగా రజనీ విమర్శలపై జయకుమార్‌ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి సంతాప సభలో రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడాల్సింది కాదని అన్నారు. ‘అది మృతిచెందిన ఓ నాయకుడి సంతాప సభ. అక్కడ రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు. రాజకీయాలు మాట్లాడడం వల్ల రజనీకాంత్‌కు రాజకీయ పరిణితి లేదని అర్థమవుతోంది’ అని విమర్శించారు.
 
సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కరుణానిధి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. మెరీనా బీచ్‌లో జరిగిన కరుణానిధి అంత్యక్రియలకు  దేశంలోని అనేకమంది నాయకులు హాజరయ్యారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం హాజరు కాలేదన్నారు.. ‘‘ఈ అంత్యక్రియలకు మొత్తం భారత దేశమే తరలి వచ్చింది. త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. గవర్నర్‌తో పాటు అనేకమంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  కాంగ్రెస్ అధినేత రాహుల్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ తమిళనాడు సీఎం మాత్రం రాలేదు. ఎందుకు?  మంత్రి వర్గం అంతా రాకుడదా?  మీరేమైనా ఎంజీఆర్ లేక జయలలిత అనుకుంటున్నారా?’’ అని రజనీ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు