14న రజనీకాంత్‌ పార్టీ ఆవిర్భావం

17 Mar, 2018 01:34 IST|Sakshi

పార్టీలో యువతకు ప్రాధాన్యం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ పేరును ఏప్రిల్‌ 14వ తేదీ తమిళ ఉగాది నాడు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో 35 ఏళ్ల లోపు యువతకు ప్రాధాన్యమిచ్చేలా వివిధ విభాగాల ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏ పార్టీతో పొత్తు లేకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ ఇప్పటికే ప్రకటించారు. ‘రజనీ మక్కల్‌ మంద్రం’ పేరుతో సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జీల నియామకం సాగుతోంది.

పార్టీ అనుబంధ యువజన విభాగంలో 35 ఏళ్ల లోపువారికి మాత్రమే స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శులుగా రాజు మహాలింగం, సుధాకర్‌ పేర్లు ఖరారయ్యాయి. పార్టీ జిల్లా విభాగాలకు అధ్యక్షులు బదులు కార్యదర్శులు మాత్రమే ఉంటారు. కార్యదర్శి కింద ఇద్దరు సహాయ కార్యదర్శులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులను నియమిస్తారు. అలాగే, యువజన, మహిళ, వాణిజ్య, మత్స్య, న్యాయ, వ్యవసాయ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈనెలాఖరులోగా ఈ ఆరు అనుబంధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని రజనీ భావిస్తున్నారు. హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని త్వరలో చెన్నైకి రానున్న రజనీ, ఏప్రిల్‌ 14న తమిళ ఉగాది సందర్భంగా పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇలా ఉండగా, సినీ పరిశ్రమలో స్నేహితులైన రజనీ, కమల్‌ల రాజకీయ ప్రవేశం తనకు ఎంతో సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఇద్దరి తరఫునా ఎన్నికల ప్రచారం చేస్తానని దివంగత శివాజీ గణేశన్‌ కుమారుడు, నటుడు ప్రభు శుక్రవారం వేలూరులో ప్రకటించారు. 

మరిన్ని వార్తలు