పొంగల్‌కు తలైవా పార్టీ?

15 Jun, 2018 08:45 IST|Sakshi
రజనీకాంత్‌

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ రాజకీయ పార్టీని పొంగల్‌ రోజున ప్రకటించనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. గత 25 ఏళ్ల అభిమానుల ఒత్తిడి కారణమో, ఆయన చిరకాల వాంఛ కారణంగానో రజనీకాంత్‌ ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్‌లో రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించారు. దీంతో తలైవా రాజకీయాల్లోకి వస్తున్నారన్న సంతోషం ఆయన అభిమానుల్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే విధంగా రజనీకాంత్‌ తన అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చారు. ఆ సంఘాల నిర్వాహక బాధ్యతలను రాజుమహాలింగం, సుధాకర్‌కు అప్పగించారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం, జిల్లాలవారిగా నిర్వాహకుల ఎంపిక కార్యక్రమాలను పూర్తి చేశారు.

రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు వెల్లడించినప్పుడే తమ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తుందని రజనీకాంత్‌ ప్రకటించారు. అయితే పార్టీ ప్రకటన ఎప్పుడన్నది అప్పటి నుంచి రజనీకాంత్‌ ఊరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది తమిళ ఉగాదికి పార్టీ పేరును, విధివిధానాలను వెల్లడిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సరిగ్గా ఆ సమయంలో పార్టీ ప్రకటన లాంటిది ఇప్పట్లో లేదన్న రజనీకాంత్‌ ప్రకటన ఆభిమానుల్లో నిరుత్సాహాన్ని కలిగించింది. అలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ ముఖ్యకార్యకర్తలను తన ఇంటికి పిలిపించి పార్టీ వ్యవహారాల గురించి చర్చించి వారిలో మళ్లీ నూ తనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ రాజకీయాలకు దూరంగా తన తాజా చిత్ర షూటింగ్‌ కోసం రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో డెహ్రాడూ న్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ చిత్ర షూటింగ్‌ మూడు నెలల పాటు జరుగుతుంది. ఆ తరువాతే మళ్లీ రాజకీయపరమైన చర్చలపై దృష్టిసారించే అవకాశం ఉంది. పొంగల్‌కు రజనీకాంత్‌ పార్టీని ప్రకటిస్తారని ఆయన అభిమాన వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలం టే రజనీకాంత్‌ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే.

రజనీకి సమస్యలు తెలియవు
రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంపై రాజకీయ నాయకులు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. మరికొందరు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ కూడా రజనీకాంత్‌కు బడుగు వర్గాల సమస్యలు తెలిసే అవకాశం లేదని పేర్కొన్నారు. ఆయన తిరువారూర్‌లో బుధవారం  విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నది సరిగ్గా తెలియడం లేదన్నారు. అయినా సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్న రజనీకాంత్‌కు బడుగ వర్గాల సమస్యలు తెలిసే అవకాశం లేదని బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు