రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

5 Sep, 2019 06:54 IST|Sakshi

సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవా? అందుకు అయన అంగీకరించరు అని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణ దశకు చేరుకుంటోందన్నారు. ఉద్యోగావకాశాలు కరువయ్యాయని పేర్కొన్నారు. ఆటో మొబైల్‌ వంటి ప్రముఖ పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయన్నారు. వీటి గురించి ఏమాత్రం ఆందోళన చెందకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఎలా డబ్బులు గుంజాలా అనే ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. ప్రచారాల కోసం ప్రకటనలు చేసుకుంటున్న బీజేపీ పార్టీ ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగు పరచాలన్న విషయం గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. 

రజనీకాంత్‌ పార్టీ సభ్యుడే కాదు..
ఇకపోతే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి కాళీ అవడంతో ఆ పదవిని నటుడు రజనీకాంత్‌కు కట్టప్టెనున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. దీని గురించి తిరునావుక్కరసర్‌ స్పందిస్తూ నటుడు రజనీకాంత్‌ బీజేపీ సభ్యుడే కాదని, పార్టీలో సభ్యుత్వం లేని వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడెలాఅవుతారని ప్రశ్నించారు. అయినా బీజేపీ అంతగా సభ్యులు లేని పార్టీనా రజనీకాంత్‌ కంటే వేరే వ్యక్తి ఆ పార్టీలో లేరా అంతగా నాయకుల కొర త ఆ పార్టీలో ఉందా అని అన్నారు. అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టడానికి నటు డు రజనీకాంత్‌ అంగీకరిస్తారా? అన్నది సందేహమేనని తిరునావుక్కరసర్‌ పేర్కొన్నారు.

రజనీ వైపు ఆ నాయకుల చూపు
కాగా రజనీకాంత్‌ సొంతంగా పార్టీని నెలకొల్పుతారా లేక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపడతారా అన్న ఆసక్తి అలా ఉంటే, మరో వైపు రజనీకాంత్‌ పార్టీని ప్రారంభిస్తే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీకి చెందిన ప్రముఖులు కొందరు ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం గురించి గత 20 ఏళ్లకు పైగా చెబుతూనే ఉన్నారు. ఎట్టకేలకు గత 2017 డిసెంబర్‌లో రాజకీయపార్టీని ప్రారంభించనున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. తాను ఎంజీఆర్‌ పాలనను మళ్లీ తీసుకు రాగలనని, జయలలిత, కరుణానిధి లేని లోటును తాను భర్తీ చేస్తానని చెప్పి ఆయన అభిమానుల్లో నూతనోత్సాహాన్నినింపారు. రజనీ రాజకీయ ప్రకటన రాష్ట్రంలో తీవ్ర ప్రభావాన్నే చూపింది.

పాలక, ప్రతి పక్ష పార్టీలో అలజడిని సృష్టించింది. అయితే ఆయన పార్టీని ప్రారంభిస్తానని చెప్పి 20 నెలలు కావస్తోంది. ఇప్పటీకీ పార్టీని కానీ, జెండా, అజెండాను కానీ వెల్లడించలేదు. అయితే రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 శాసనసభ స్థానాల్లోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పడంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలో అసంతృప్త ప్రముఖ నాయకుల దృష్టి రజనీకాంత్‌ ప్రారంభించపోయే పార్టీపై పడుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో రజనీకి నిజంగానే బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించాలనుకుంటోందా అందుకు రజనీ అంగీకరిస్తారా? లేక సొంత పార్టీని ప్రారంభించడానికే ముందుకెళతారా అన్న సవాలక్ష ప్రశ్నలు జనాల్లోంచి పుట్టుకొస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు