బీజేపీ మేనిఫెస్టో కమిటీ సారథిగా రాజ్‌నాథ్‌

7 Jan, 2019 04:15 IST|Sakshi

ప్రచార కమిటీకి జైట్లీ నేతృత్వం

17 కమిటీలను ప్రకటించిన షా

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదివారం 17 సంస్థాగత కమిటీలను ఏర్పాటుచేశారు. కీలకమైన సంకల్ప్‌పత్ర (మేనిఫెస్టో) కమిటీకి సీనియర్‌ నాయకుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సారథిగా నియమించారు. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్, థావర్‌చంద్‌ గెహ్లాట్, రవిశంకర్‌ ప్రసాద్, పీయూష్‌ గోయల్, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కేజే అల్ఫోన్స్, కిరణ్‌ రిజిజు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సహా మొత్తం 20 మందికి చోటు కల్పించారు.

అలాగే, మరో సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. ఎనిమిది మంది సభ్యులుండే ఈ కమిటీలో మంత్రులు పీయూష్‌ గోయల్, రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్, అనిల్‌ జైన్, మహేశ్‌ శర్మ తదితరులున్నారు. సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు చేరవయ్యేందుకు నియమించిన కమిటీకి నితిన్‌ గడ్కరీ, మీడియా కమిటీకి రవిశంకర్‌ ప్రసాద్‌ నేతృత్వం వహించనున్నారు. అలాగే మేధావులతో సమావేశాలు నిర్వహించే కమిటీకి ప్రకాశ్‌ జవడేకర్‌ నాయకత్వం వహిస్తారు. ఎన్నికల ప్రచార సాహిత్య రూపకల్పన కమిటీకి సుష్మా స్వరాజ్‌ నేతృత్వం వహించనున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్‌ పాండే నాయకత్వంలోని కమిటీకి అప్పగించారు. ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజు, ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ సహా 13 మందితో సోషల్‌ మీడియా కమిటీ ఏర్పాటుచేశారు. ప్రసాద్‌ నేతృత్వంలోని మీడియా కమిటీలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధులందరికీ చోటు కల్పించారు. పార్టీ కార్యాలయ పనులు, రవాణా, సాహిత్య పంపిణీ, మోదీ మన్‌కీ బాత్, బైకు ర్యాలీల నిర్వహణకు కూడా కమిటీలు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు