‘దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించండి’

15 May, 2019 09:52 IST|Sakshi

విపక్షాలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ సవాల్‌

లక్నో: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల  మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  చివరి విడత లోకసభ ఎన్నికలు ఈనెల 19న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కీలకమైన యూపీలో బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రచారంలో మునిగితేలుతున్నాయి. లక్నోలో పర్యటించిన కేంద్రం హోం శాఖమంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజ్‌నాథ్‌ సింగ్‌ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. కూటమి నేతలకు దమ్ముంటే  ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని సవాల్‌ విసిరారు.

లక్నోలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ, మన్మోహన్‌ సింగ్‌, సోనియాగాంధీ మధ్య ఎన్నికల పోరు జరిగింది.ఈసారి ప్రతిపక్షాలకు సరైన ప్రధాని అభ్యర్థి కూడా లేరు. మోదీని ఎదుర్కొనే నాయకడు మీలో ఎవరు? ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి.. ఇంకా దాగుడు మూతలెందుకు.. దమ్ముంటే అభ్యర్థిని ప్రకటించండి’ అని అన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ జాతీయ స్థాయిలో మెరగైన ఫలితాలను సాధిస్తుందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కూడిన కూటమి పార్టీలపై ప్రజలకు నమ్మకంలేదన్నారు. 


 

మరిన్ని వార్తలు