కేంద్ర పథకాలకు మోకాలడ్డు

3 Apr, 2019 02:45 IST|Sakshi
నిజామాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. సభకు హాజరైన జనం

తెలంగాణలో అవినీతి పాలన  

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ధ్వజం  

దేశభద్రత విషయంలో ప్రతిపక్షాలది రాజకీయం  

ప్రజలు బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు 

నిజామాబాద్, మహబూబాబాద్‌లో బీజేపీ సభ  

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/మహబూబాబాద్‌: తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ సర్కారు వాటిని ప్రజల చెంతకు చేరకుండా అడ్డుకుందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో, అలాగే మహబూబాబాద్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. టెర్రరిస్టు కార్యకలాపాలు ఆపకపోతే పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని హోంమంత్రి హెచ్చరించారు. టెర్రరిస్టులకు శిక్షణ ఇవ్వడం మానకపోతే ఆ దేశానికి తగిన శాస్తి చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ సర్కారు హయాంలో పాకిస్తాన్‌ మన దేశాన్ని బలహీనమైనదిగా చూసిందన్నారు. ఇటీవల పుల్వామా దాడికి భారత త్రివిధ దళాలు ఎలాంటి సమాధానం ఇచ్చాయో చూడవచ్చన్నారు. శత్రుదేశం మనదేశం మీద ఒక్క బుల్లెట్‌ ప్రయోగిస్తే, పది బుల్లెట్లు ప్రత్యర్థి దేశం మీద ప్రయోగించేలా దేశ సైన్యానికి స్వేచ్ఛను ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు.

దేశభద్రత విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ముంబై దాడులు చేస్తే ఏమీ చేయలేదన్నారు. బాలాకోట్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 48 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందితే, మోదీ ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతోనే మనదేశ ఎయిర్‌ఫోర్స్‌ 100 మీటర్ల లోపలికి శత్రుదేశంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందన్నారు. మనదేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల విజయాలను అభినందిస్తే, ప్రతిపక్షాలు విమర్శలు చేయటం ఏమిటని విమర్శించారు. ప్రధాని మోదీ మీద అవినీతి ఆరోపణలు లేకపోవటంతో, రఫేల్‌ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. భారత రక్షణ దళాన్ని పటిష్టం చేయటానికే రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలు గతంలో పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పరిపాలనలో తేడాను గమనించి మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజలు బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.  

అగ్రరాజ్యాల సరసన భారత్‌ 
మోదీ ప్రభుత్వంలో దేశం ఆర్థిక వ్యవస్థ బలపడిందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో 9వ స్థానంలో ఉన్న భారత్‌ బీజేపీ పాలనలో ఆరో స్థానానికి ఎగబాకిందని గుర్తు చేశారు. 2028 నాటికి అగ్రరాజ్యాల సరసన భారత్‌ ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.  

సభా వేదిక వద్ద అగ్నిప్రమాదం 
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం పాల్గొన్న బహిరంగ సభా వేదిక వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కలకలం రేగింది. మంత్రి హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో సభావేదిక వద్దకు చేరుకున్న కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. వేదికపై ఏసీకి ఉన్న విద్యుత్‌ లైన్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో చిన్న పాటి మంటలు రేగాయి. దీంతో రెడ్‌ కార్పెట్‌ దగ్ధమైంది. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పింది.  

రాష్ట్రం దాటితే కేసీఆర్‌ చెల్లని రూపాయి: లక్ష్మణ్‌ 
తెలంగాణ సరిహద్దులు దాటితే కేసీఆర్‌ చెల్లని రూపాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతామని సీఎం బూటకపు మాటలు చెబుతున్నారని, చక్రం కాదు బొంగరం కూడా తిప్పలేరన్నారు. కేసీఆర్‌ అంటున్నట్లుగా అది ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని, ఫ్యామిలీ ఫ్రంట్‌ అని విమర్శించారు. కవిత, హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులే ఈ ఫ్రంట్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రధాని అభ్యర్థి అసదుద్దీన్‌నా? మాయవతా? మమతా? రాహుల్‌గాం«ధీనా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయరు కానీ ప్రధాన మంత్రి అభ్యర్థినంటూ ప్రజల చెవుల్లో బీడీలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్‌ఎస్‌ భరతం పడుతామని, మీ అవినీతి బయటపెడుతామని హెచ్చరించారు.  

వంద రోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తాం  
కేసీఆర్‌ ఐదేళ్ల పాలనలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాజ్‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా అని ప్రజలను అడిగితే మద్యం మాత్రం లభిస్తుందనే సమాధానం వస్తోందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వంద రోజుల్లో నిజాంషుగర్స్‌ను తెరిపిస్తామని, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపు, ఎర్రజొన్నకు మంచి ధర లభించేలా చర్యలు చేపడతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు