విపక్షాలపై మండి పడిన రాజ్‌నాథ్‌ సింగ్‌

30 Mar, 2019 17:24 IST|Sakshi

గాంధీనగర్‌ : పాకిస్తాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన ఘనతను ఇందిరా గాంధీకి ఆపాదించినప్పుడు.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఘనత నరేం‍ద్ర మోదీకి దక్కడంలో తప్పేంటని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశ్నించారు. గాంధీనగర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగిస్తూ.. ‘1971లో జరిగిన పాకిస్తాన్‌ యుద్ధంలో మన దేశం విజయం సాధించింది. ఫలితంగా పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఈ ఘనత అంతా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీదే అంటూ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల కూడా అభినందించాయి. ఈ యుద్ధం తర్వాత బీజేపీ నాయకుడు వాజ్‌పేయి కూడా ఇందిరా గాంధీని పొగిడారు. ఆమె నిర్ణయాన్ని దేశ ప్రజలంతా కొనియాడుతున్నారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు ఉగ్రశిబిరాల మీద సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇందుకు మోదీని అభినందిస్తే తప్పేంట’ని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

‘ముష్కరులు 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపేశారు. ఇందుకు ప్రతీకారంగా మోదీ మన సైన్యానికి అన్ని అధికారాలు మంజూరు చేశారు. మన జవాన్ల మీద దాడి చేసిన ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఎన్నికల జిమ్మిక్కుగా విమర్శించడం దారుణం. అంటే మోదీ సాధించిన విజయానికి ఆయన క్రెడిట్‌ తీసుకోవద్దా’ అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఏళ్లుగా అద్వాణీ పోటీ చేస్తూ వస్తోన్న గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి ఈ సారి అమిత్‌ షా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు