పాక్‌ ఒక్క బుల్లెట్‌.. భారత్‌ లెక్కే ఉండదు... జాగ్రత్త!

4 Feb, 2018 12:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అగర్తలా : దాయాది పాకిస్థాన్‌కు భారత్‌ మరో గట్టి హెచ్చరిక జారీ చేసింది. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడితే.. భారత సైన్యం చేసే ప్రతిదాడులకు హద్దే ఉండబోదని తేల్చి చెప్పింది. మీరు(పాక్‌ను ఉద్దేశించి) ఒక్క బుల్లెట్‌ కాలిస్తే.. మన తరపు నుంచి లెక్క లేని బుల్లెట్లు దూసుకెళ్తాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టిగా హెచ్చరించారు. 

త్రిపురలోని బర్జాలలో శనివారం రాత్రి బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘భారత్‌ పాకిస్థాన్‌ తో శాంతిపూర్వక బంధాన్ని కొనసాగించాలని అనుకుంటోంది. కానీ, వాళ్లు మాత్రం కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్నారు. మనం సహనంతో ఉండాల్సిన పని లేదు. సరిహద్దులో మోహరించిన సైన్యానికి ఇప్పటికే ఆదేశాలిచ్చాం. అవతలి నుంచి ఒక్క బుల్లెట​ పేలితే.. ఇవతలి నుంచి ఊహించని రీతిలో దాడి చేయాలని ఆదేశాలిచ్చాం’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 


                                              సభలో ప్రసంగిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

‘పాకిస్థాన్‌పై మొదట దాడి చేయటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం కాదు. పొరుగు దేశాలతో సన్నిహితంగా మెలగాలనే భారత్‌ కోరుకుంటోంది. కానీ, పాక్‌ జమ్మును చీల్చేందుకు కుట్ర పన్నుతోంది. సరిహద్దుల్లో దాడులతో సైనికులను, పౌరులను బలితీసుకుంటోంది. అందుకే కఠిన నిర్ణయాలు అమలు చేయబోతున్నాం. పాక్‌ ఎన్ని వ్యూహాలు చేసినా కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టలేదు’ అని రాజ్‌నాథ్‌ వెల్లడించారు.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సీపీఎం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 25ఏళ్ల వామపక్ష ప్రభుత్వ హయాంలో త్రిపుర ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందని... సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని రాజ్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు