సమాజాన్ని  విభజించే యత్నం!

15 Dec, 2019 04:02 IST|Sakshi

కులం, మతం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

పవన్‌కల్యాణ్‌ తీరుపై రాజు రవితేజ తీవ్ర విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. కులం, మతం ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ పేర్కొన్నారు. పార్టీ మూల సిద్ధాంతాలు, మౌలిక విలువలకు విరుద్ధంగా పవన్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్‌తో కలసి పనిచేయకండి.. ఆయన్ను నమ్మకండి.. అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రవితేజ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జనసేన ఆధ్వర్యంలో సమాజాన్ని విభజించే, విచ్ఛిన్నపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. నెలన్నర రోజులుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందన్నారు.

సొంత పార్టీ వారిపైనే పథకాలు రచించడం, పైకి రానీయకుండా చేయడం పవన్‌ నైజమని, పార్టీని పర్సనల్‌ ప్రాపర్టీగా వాడుకుంటున్నారని అన్నారు. సంబంధం లేని వ్యక్తిగత విషయాలను బహిరంగ వేదికలపై వ్యాఖ్యానించడం తప్పన్నారు. పవన్‌కల్యాణ్‌ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని.. సమాజాన్ని విభజించే విధంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన సిద్ధాంతం కుల, మత ప్రస్తావన లేని, హింసకు తావులేని రాజకీయం కాగా, అందుకు విరుద్ధంగా ఆయన వెళుతున్నారని అన్నారు. ఇటీవల పవన్‌ పాల్గొన్న సభలోనే ఒక యువకుడు తలలు నరుకుతానంటూ ప్రసంగాలు చేసినా దానిని ఖండించకపోవడం ద్వారా ఎలాంటి సంకేతం వెళుతుందని ప్రశ్నించారు. మతం, కులం, హింస అంటూ మాట్లాడటం.. తాట తీస్తా, తోలు తీస్తా, పరిగెత్తించి కొడతాననడం సరికాదన్నారు. మరో ఐదేళ్లు ఆయనేమీ చేయలేరని, భవిష్యత్‌లో కూడా ఆయన ఏమీ కాలేరని, ఎవరో ఒకరిగా మిగిలిపోతారని వివరించారు.

మరిన్ని వార్తలు