ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వాయిదా

5 Feb, 2018 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడగా... లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా , బడ్జెట్‌ విషయాలపై రాజ్యసభ దద్దరిల్లింది. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు సరిగా జరుగలేదని.. ఏపీ ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరుగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు పోడియం వద్దకు వెళ్లి కాంగ్రెస్‌, వైసీపీలు నిరసన వ్యక్తంచేశారు. బడ్జెట్‌లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ఆందోళన వ్యక్తంచేశారు. 

కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావును పలుమార్లు తన సీటు వద్దకు వెళ్లి కూర్చోవాలని వెంకయ్యనాయుడు కోరారు. అయినప్పటికీ కేవీపీ తన నిరసనను ఆపకపోవడంతో, వెంకయ్యనాయుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీలు కూడా పెరిగిన పెట్రోల్‌ ధరలపై ఆందోళన చేశారు. ''నోయిడా నకిలీ ఎన్‌కౌంటర్‌' విషయంపై సమాజ్‌వాద్‌ పార్టీ నిరసన వ్యక్తంచేసింది. ఉత్తరప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్లపై చర్చ జరుగాలని పార్టీ సభ్యులు పట్టుబట్టారు. పార్టీకి చెందిన నరేష్‌ అగర్వాల్‌ ఈ విషయంపై నోటీసు కూడా అందజేశారు. అయితే ఈ నోటీసును వెంకయ్యనాయుడు తిరస్కరించారు. దీంతో ఎస్పీ సభ్యులు కూడా నిరసన చేపట్టారు. ఈ నిరసనల మధ్య రాజ్యసభను  వెంకయ్యనాయుడు రెండు గంటల వరకు వాయిదా వేశారు. 

లోక్‌సభ వాయిదా

శనివారం మరణించిన బీజేపీ సభ్యుడు హుకుమ్‌ సింగ్‌కు సంతాపం వ్యక్తం చేసిన లోక్‌సభ కూడా రేపటికి వాయిదా పడింది. వాటర్‌ రిసోర్సస్‌ స్టాండింగ్‌ కమిటీకి చైర్‌పర్సన్‌గా, లోకసభ సాధారణ ప్రయోజనాల కమిటీకి సభ్యుడిగా సింగ్‌ ఉండేవారు. 

గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆందోళన
విభజన చట్టం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... అటు టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. ఫ్లకార్డులతో ప్రదర్శన కూడా చేపట్టారు. అయితే టీడీపీ ఎంపీలు చేసిన ఈ నిరసనకు కేంద్ర మంత్రులు ఆశోక్‌ గణపతి రాజు, సుజనా చౌదరి దూరంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు