రాజ్యసభ ద్వితీయం కాదు.. అద్వితీయం

19 Nov, 2019 03:40 IST|Sakshi

వాజ్‌పేయి మాటలను గుర్తు చేసిన ప్రధాని

సమాఖ్య వ్యవస్థకు రాజ్యసభ ఆత్మవంటిది

ఎన్సీపీ, బీజేడీని చూసి నేర్చుకోవాలి

శరద్‌ పవార్, నవీన్‌ పట్నాయక్‌ పార్టీలపై ప్రధాని ప్రశంసలు

250 సెషన్లతో చరిత్ర సృష్టించిన రాజ్యసభ

250 సెషన్లతో చరిత్ర సృష్టించిన సభ

ప్రజాస్వామ్యంలో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌ (అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసేతప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు) కోసం రాజ్యసభ అవసరం ఎంతైనా ఉంది. భారతసమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిది. అదే ఎప్పటికీ శాశ్వతం. వాజ్‌పేయి సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాజ్యసభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయకూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం     
– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌ (అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసే తప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు) కోసం రాజ్యసభ అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సభ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడానికి, సభను స్తంభింపజేయడానికి మధ్య సమతుల్యత పాటించాలని పార్టీలకు సూచించారు. రాజ్యసభ చారిత్రక 250వ సమావేశాలను పురస్కరించుకొని సోమవారం ప్రధాని సభలో మాట్లాడారు. భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిదని, అదే ఎప్పటికీ శాశ్వతమని అన్నారు. రాజ్యసభలో అధికార ఎన్డీయేకి మెజార్టీ లేకపోవడంతో ఎన్నో కీలక బిల్లులు చట్టరూపం దాల్చకపోవడంతో బీజేపీలోనే పెద్దల సభ ఆవశ్యకతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వీటికి సమాధానంగా ప్రధాని మోదీ దివంగత మాజీప్రధాని వాజ్‌పేయి మాటల్ని గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘‘వాజ్‌పేయి సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాజ్యసభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయకూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం’’అని అన్నారు. ఆర్టికల్‌ 370, 35(ఏ) వంటి బిల్లుల్ని ఆమోదించడంలో రాజ్యసభ పోషించిన కీలక పాత్రని ఎవరూ మర్చిపోలేరని అన్నారు. జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో రెండు సభలు ఐక్యతతో ముందుకు సాగాలని మోదీ ఆకాంక్షించారు.

విశేష అధికారాలివ్వాలి: మన్మోహన్‌
రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం వంటి ముఖ్యమైన అంశాలలో రాజ్యసభ మరింత విస్తృతమైన పాత్ర పోషించాలని మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.   కొన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు మరింత గౌరవప్రదమైన స్థానం కల్పించాలని అన్నారు. జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని నేరుగా ప్రస్తావించకుండా మన్మోహన్‌ పలు సూచనలు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం వంటి అంశాల్లో రాజ్యసభకు విశేష అధికారాల్ని కట్టబెట్టాలని అన్నారు.  

ఆత్మపరిశీలన అవసరం: వెంకయ్య
ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా రాజ్యసభ పనితీరు లేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌  వెంకయ్యనాయుడు అన్నారు. సభ్యులందరూ ఈ అంశంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. భారత రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, పురోగతి అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ గత 67 ఏళ్లలో దేశం సామాజికంగా, ఆర్థికంగా రూపాంతరం చెందడంలో ఎగువ సభ ప్రధాన పాత్ర పోషించిందని, అయితే సభికులు ప్రజల అంచనాలను అందుకోలేదని అన్నారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చలు సభ్యులు చేయాలంటూ పలు సూచనలు చేశారు.

ఎన్సీపీ, బీజేడీ పాత్ర భేష్‌
ప్రధాని మోదీ అనూహ్యంగా శరద్‌ పవార్‌ నేతృత్వంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలో బిజూ జనతాదళ్‌ (బీజేడీ) పార్టీలపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యసభలో ఆ పార్టీల సభ్యులెవరూ వెల్‌లోకి దూసుకురాకుండానే, అత్యంత సమర్థంగా సమస్యల్ని లేవనెత్తుతారని కొనియాడారు. ‘పెద్దల సభ మనకి అత్యంత అవసరం. ఈ సందర్భంగా రెండు పార్టీలను కచ్చితంగా ప్రశంసించాలి. ఎన్సీపీ, బీజేడీ పార్లమెంటు నియమనిబంధనల్ని తు.చ. తప్పక పాటిస్తున్నా యి. ఆ రెండు పార్టీల సభ్యులు ఎప్పుడూ వెల్‌లోకి దూసుకువెళ్లలేదు. వారు చెప్పదలచుకున్నదేదో అద్భుతంగా, సమర్థవంతంగా చెబుతారు. వారి నుంచి అన్ని పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’అని ప్రధాని కొనియాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనతో ఎన్సీపీ చేతులు కలుపుతున్న వేళ మోదీ ఆకస్మికం గా ఆ పార్టీపై ప్రశంసల జల్లులు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.  

మార్షల్స్‌ డ్రెస్‌ మారింది  
రాజ్యసభ చారిత్రక 250వ సెషన్లను పురస్కరించుకొని సభలో చైర్మన్‌కు ఇరువైపులా నిలబడే మార్షల్స్‌ యూనిఫామ్‌ను చూసి సభికులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎప్పుడూ తెల్లటి సంప్రదాయ దుస్తులు, తలపాగాతో కనిపించే మార్షల్స్‌ ఈ సమావేశాల సందర్భంగా మిలటరీ దుస్తుల్ని తలపించే యూనిఫామ్‌ వేసుకొని ఠీవీగా నిలబడ్డారు. నేవీ బ్లూ యూనిఫామ్, టోపీ, భుజాలకు బంగారు రంగు స్ట్రైప్స్, స్టార్స్‌తో మార్షల్స్‌ కొత్తగా కనిపించారు. వేసవి కాలం సమావేశాల్లో తెల్ల రంగు యూనిఫామ్‌లోనే మార్షల్స్‌ కనిపిస్తారు. ఈ దుస్తుల్ని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థ డిజైన్‌ చేసినట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి.

పెద్దల సభకు పెద్ద పండుగ
1952లో ఏర్పాటైన రాజ్యసభ 250 సెషన్లతో చరిత్ర సృష్టించింది. పెద్దల సభ ప్రయాణం ఎలా సాగిందంటే...  

మహిళా సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది ఇలా !
1952లో 15 మంది మహిళా సభ్యులుంటే (6.94%) 2014 నాటికి వారి సంఖ్య 31కి (12.76%) చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులకు గాను 26 మంది మహిళలు (10.83%)

చారిత్రక ఘట్టాలు
► రాజ్యసభ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఒకే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1991 ఆగస్టు 5న క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ విపక్షాలు పెట్టిన తీర్మానం 39–39 ఓట్లతో టై అయింది. అప్పుడు ప్రిసైడింగ్‌ అధికారి ఓటు వేయడంతో ప్రతిపక్షాలు విజయం సాధించాయి.  

► రాష్ట్రపతి పాలన గడువు పెంచిన చరిత్ర కూడా పెద్దల సభకుంది. 1977లో తమిళనాడు, నాగాలాండ్, 1991లో హరియాణాలో రాజ్యసభ రాష్ట్రపతి పాలనను పొడిగించింది. అప్పట్లో లోక్‌సభ మనుగడలో లేదు.

► రాజ్యసభ ఇప్పటికి ముగ్గురు సభ్యులను బహిష్కరించింది. 1976లో సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామిని. 2005లోప్రశ్నలకు ముడుపులు కేసులో ఛత్రపాల్‌ సింగ్‌ను, ఎంపీలాడ్స్‌లో అవకతవకలకు 2006లో సాక్షి మహరాజ్‌ను సభ నుంచి బహిష్కరించింది.   


సభలో మాట్లాడుతున్న వెంకయ్య, పక్కన కొత్త యూనిఫామ్‌తో మార్షల్స్‌

మరిన్ని వార్తలు