ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి

22 Jul, 2020 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమ, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారుని రాజ్యసభ ఎంపీ మోపిదేవీ వెంకటరమణ అన్నారు. ఏడాది కాలంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంలోకి వెళ్లడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు పొందిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. ‘ఇది మా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఇద్దరు బీసీలకు రాజ్యసభ చోటు కల్పించడం అరుదైన విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టం మేరకు రైతులకు రెండున్నర రెట్లు ధర చెల్లిస్తున్నాం. సేకరించిన భూమిని ఇల్లు లేని పేదలకు ఇస్తున్నాం. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఇళ్ల స్థలాల పంపిణీపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో పస లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసి  చూపిస్తారా?’అని ప్రశ్నించారు. ఇక వైఎస్సార్‌సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
(కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం)

మరిన్ని వార్తలు