రాజ్యసభ సమావేశాలు మరోరోజు పొడగింపు

8 Jan, 2019 19:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలను కేంద్రం మరోరోజు పొడిగించింది. విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగడం, పలు అంశాలపై చర్చలు పెండింగ్‌లో ఉండటంతో సభను బుధవారానికి పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే, రాజ్యసభను రేపటికి పొడగించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అజెండాలో ఏం పొందుపరుస్తున్నారో కూడా చెప్పడంలేదని .. వ్యవస్థలను నాశనం చేసినట్టే పార్లమెంట్‌నూ చేయాలని చూస్తున్నారని మండిపడ్డాయి.

కేంద్రం తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళనకు దిగాయి. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. గులాంనబి అజాద్‌, ఆనంద్ శర్మ, డి. రాజా. కనిమొళి, సహా పలువురు రాజ్యసభ సభ్యులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.   కేంద్రం మాత్రం సమావేశాల పొడిగింపు అంశం ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టంచేసింది. కీలకమైన ఈబీసీ కోటా బిల్లుతోపాటు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చించాల్సి ఉన్నందున.. రాజ్యసభ గడువును పొడిగించినట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు