కతియార్‌కు షాకిచ్చిన ‘కమలం’

12 Mar, 2018 16:35 IST|Sakshi

వివాదాస్పద ఎంపీకి మొండిచేయి చూపిన కాషాయ పార్టీ

లక్నో: ‘ముస్లింలకు భారత్‌లో చోటు లేదు. వారు పాకిస్తాన్‌ లేదా బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వినయ్‌ కతియార్‌కు అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది.  వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. కతియార్‌కు మొండిచూపిన పార్టీ పెద్దలు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన అశోక్‌ బాజ్‌పేయి, హరనాథ్‌ సింగ్‌ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీలోని సీనియర్‌ నేతలైన సుధాంశు త్రివేది, లక్ష్మీకాంత్‌ బాజ్‌పేయిలను పక్కకు పెట్టి మరీ అశోక్‌ బాజ్‌పేయిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని 10 రాజ‍్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

వివాదాల కారణంగానే...?
‘ముస్లింలకు భారత్‌లో చోటు లేదు. జనాభా ఆధారంగా దేశాన్ని విభజించినపుడు వారికి ఇంకా ఇక్కడ ఏం పని’ అంటూ ఐదు రోజుల క్రితం కతియార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. రామునికి చెందిన భూభాగంలో కచ్చితంగా రామమందిరం నిర్మించి తీరతామ’ని గతంలోనూ వ్యాఖ్యానించారు. తేజో మందిరాన్ని విధ్వంసం చేసి తాజ్‌ మహల్‌ నిర్మించారంటూ వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆయనకు సీటు నిరాకరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తా: కతియార్‌
‘ప్రస్తుతం ఈ అంశంపై స్పందించాలనుకోవడం లేదు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన పార్టీ ఆదేశాలను పాటిస్తాను. ఇప్పుడైతే రాజకీయపరమైన అంశాలపై చర్చించాలనుకోవడం లేద’ ని వినయ్‌ కతియార్‌ మీడియాకు తెలిపారు

ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు..
పలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కతియార్‌ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ చైర్మన్‌కు పలువురు సామాజిక కార్యకర్తలు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు