రాజ్యసభకు ‘ట్రిపుల్‌ తలాక్‌’ బిల్లు

31 Dec, 2018 05:01 IST|Sakshi

నేడు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

వ్యతిరేకిస్తామంటున్న కాంగ్రెస్, ఇతరపక్షాలు

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఉన్నదున్నట్టుగా ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ తేల్చిచెబుతోంది. అధికార బీజేపీ మాత్రం ఓటింగ్‌ సమయంలో రాజ్యసభలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని విప్‌ జారీ చేసింది. గురువారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మిత్రుల సంఖ్యతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ఇతర పక్షాలతో కలిసి తప్పకుండా బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. 2018లో దాదాపు పది పార్టీలు ఈ బిల్లును నేరుగానే వ్యతిరేకించాయని చెప్పారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతునిచ్చిన పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిల్లుపై ప్రభుత్వం తొందరపడుతోందని, మరింత మెరుగైన అధ్యయనంకోసం బిల్లును పార్లమెంట్‌ జాయింట్‌ సెలెక్ట్‌కి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఇది ముస్లిం మహిళల సమానత్వం, గౌరవం కోసం ఉద్దేశించినదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు.  ఈ బిల్లు ముస్లిం కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నదని ఆలిండియా ముస్లిం విమెన్‌ పర్సనల్‌ లాబోర్డు అంటోంది. బిల్లుపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించడం  వల్ల సమాజంలో అలజడులు చెలరేగే అవకాశముందని విమెన్‌ పర్సనల్‌ లాబోర్డు అధ్యక్షురాలు శైస్త్రా అంబర్‌  చెప్పారు.  ప్రతిపాదిత చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ చేస్తే విడాకులు ఇచ్చిన భర్తకు మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు