టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ

21 Sep, 2018 04:04 IST|Sakshi

భానుగుడి(కాకినాడ సిటీ): ‘రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా నిలిచింది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.8.50 లక్షల కోట్ల విలువైన వనరులున్న రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు తప్పుడు ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు అందజేస్తోందని రాంమాధవ్‌ చెప్పారు. అయినా కేంద్రం నిధులివ్వడం లేదంటూ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు రాష్ట్ర వనరులను కట్టబెడితే ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు అన్ని రకాలుగా దోచుకుతింటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

2014లో తుప్పు పట్టిన టీడీపీకి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోబట్టే మహర్దశ వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్‌ జైన్, రాష్ట్ర ఇన్‌చార్జి వి.మురళీధర్, కోఇన్‌చార్జి సునీల్‌ దియోధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహరావు, ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజు, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్‌ మాధవ్, ఎమ్మెల్యేలు  మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు