టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ

5 Nov, 2018 02:23 IST|Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘నిన్నటి వరకు కాంగ్రెస్‌ను అనరాని మాటలతో దూషిం చిన తెలుగుదేశం పార్టీ రాత్రికి రాత్రే ప్లేట్‌ ఫిరాయించింది. కాంగ్రెస్‌కు మిత్ర పక్షమై.. నేను తెలుగుదేశం పార్టీ కాదు.. నేను తెలుగు ద్రోహుల పార్టీ అని ఆ పార్టీ తన పేరు మార్చుకుంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో నియోజకవర్గ స్థాయి ప్రముఖుల శిక్షణ శిబిరం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి రాంమాధవ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పొంతన లేని పార్టీలు రాష్ట్రంలో మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎలాగో మునుగుతుందని, ఎవరెవరు వెంట వస్తే వారిని కూడా ముంచే కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్‌ ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఉన్న వ్యతిరేకతను చూసి ప్రజలు తమకే పట్టం కడతారన్న భ్రమలో కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు. జెండా ఎజెండా లేనిది మహాకూటమని, ఈ కూటమి విజయం సాధించడం అసాధ్యమన్నారు. ప్రజలకు బీజేపీ ఆశాకిరణంలా కనిపిస్తోందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థితిలో ఉంటుందని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌కి 30 సీట్లు కూడా రావన్నారు. ఈ శిబిరంలో బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు