ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్‌ షూటర్‌ హిమంత బిశ్వా శర్మ

25 Mar, 2019 09:54 IST|Sakshi

న్యూఢిల్లీ : బీజేపీలో ప్రస్తుతం అమిత్‌ షా శకం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల పార్టీ బలోపేతానికి అమిత్‌ షా కృషి చేస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రల్లో మాత్రం అమిత్‌ షా ప్రభావం అంతగా లేదట. అక్కడ అమిత్‌ షా కన్నా అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు పార్టీ జనరల్‌ సెక్రటరీ రాం మాధవ్‌. ప్రస్తుతం లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ హిమంత బిశ్వాకు టికెట్‌ కేటాయించలేదు.

ఈ విషయంపై స్పందించిన రాం మాధవ్‌.. ‘దీన్ని బట్టి పార్టీ అమిత్‌ షా కన్నా ఎక్కువ బాధ్యతలు హిమంతకే అప్పగించిందనే విషయం స్పష్టమవుతోంది. ఈశాన్య భారతంపై హిమంత బిశ్వాకు చాలా పట్టుంది. ఇప్పటి వరకూ 5, 6 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోశించారు. అందుకే పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచార భారాన్నంత ఆయన మీదనే మోపింది. ఇందుకు చాలా శక్తి, సమయం కావాలి. ఈ బాధ్యతలు చూడ్డానికే టైం సరిపోదు. ఇక ఆయన కూడా పోటీలో ఉంటే.. పార్టీ ప్రచార బాధ్యతలతో పాటు ఆయన గెలుపు కోసం కూడా కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల హిమంత బిశ్వాపై ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పార్టీ ఆయనకు టికెట్‌ కేటాయించలేద’ని తెలిపారు.

హిమంత బిశ్వాకు టికెట్‌ కేటాయించకపోవడంపై అమిత్‌ షా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈశాన్యం ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే ముఖ్యమైన బాధ్యతలను ఆయనకు అప్పగించాం. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీకి లైఫ్ ఇచ్చిన హిమంత బిశ్వా.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో కమలం వికసించేలా కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందారు.

మరిన్ని వార్తలు