‘చంద్రబాబు తెలుగు ద్రోహిగా మిగిలాడు’

31 Oct, 2018 20:45 IST|Sakshi
రాంమాధవ్‌(పాత చిత్రం)

సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాలుగేళ్లకే ప్రభుత్వం రద్దు చేసి 420గా మిగిలిపోయాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ విమర్శించారు. బుధవారం ఆయన జగిత్యాలలో మాట్లాడుతూ.. మార్పు కోసం నందమూరి తారకరామరావు టీడీపీని స్థాపిస్తే వెన్నుపోటుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ద్రోహిగా మిగిలిపోయాడని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు అవినితీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయని వ్యాఖ్యానించారు. పేదవారి కోసం కేంద్రం ఆయుష్మాన్‌ భవ పథకం తీసుకువస్తే.. తెలంగాణ ప్రభుత్వం అవసరం లేదని తిరస్కరించిందని అన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడటానికి అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్‌ కారణమని మండిపడ్డారు. వారిద్దరి అసమర్ధత వల్లే వేలాది మంది రైతులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చక్కెర ఫ్యాక్టరీని తెరపిస్తామని హామీ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు