వైఎస్సార్‌సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం

12 Mar, 2020 05:27 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీని వీడిన పలువురు నేతలు, కార్యకర్తలు

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితోపాటు ఆయన కుమారుడు వెంకట శివారెడ్డి, సోదరుడు గిరిధర్‌రెడ్డి, తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ నారాయణరెడ్డి, ఆర్‌ఆర్‌ క్లబ్‌ రమణారెడ్డి, న్యాయవాది నందకిషోర్‌రెడ్డి, చిలమకూరు జగన్నాథరెడ్డి, ఉప్పలపాటి సూర్యనారాయణరెడ్డి, ఎం.చక్రపాణిరెడ్డితో పాటు జమ్మలమడుగు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల నిర్ణయం మేరకు మనస్ఫూర్తిగా చేరా: రామసుబ్బారెడ్డి 
- టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీ మారుతున్నా. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలో చేరా. ఏమీ ఆశించలేదు. మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు. మనస్ఫూర్తిగా వైఎస్సార్‌సీపీలో చేరా.
సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా డైనమిక్‌ లీడర్‌షిప్‌తో ముందుకు వెళుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుంది.

శుభపరిణామం: సజ్జల రామకృష్ణారెడ్డి (రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రజా వ్యవహారాలు) 
- సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై విశ్వాసంతో రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరడం శుభ పరిణామం.
- సీఎం జగన్‌ పాలనను చూసి టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు.   
- చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు, ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత తూముల
బొబ్బిలి: విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం ఆయన ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన సతీమణి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తూముల అచ్యుతవల్లి, మాజీ కౌన్సిలర్లు ఆర్‌.ఎల్‌.వి.ప్రసాద్, మరిపి తిరుపతినాయుడు తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరారు.

మరిన్ని వార్తలు