రాహుల్‌ను గెలిపిస్తే.. మో​దీకే ప్రయోజనం

18 Jan, 2020 16:11 IST|Sakshi

రాహుల్‌ గాంధీపై రామచంద్రగుహ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎంపీగా గెలిపించి కేరళ ప్రజలు తప్పుచేశారు

తిరువనంతపురం : కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను వయనాడ్‌ ఎంపీగా గెలిపించి కేరళ ప్రజలను తప్పు చేశారని అన్నారు. ప్రస్తుత యంగ్‌ ఇండియాకు ఐదో తరానికి చెందిన రాహుల్‌ నాయకత్వం అవసరంలేదని వ్యాఖ్యానించారు. ఆయనతో పోల్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న తెలివితేటలు ఎంతో గొప్పవని అభిప్రాయపడ్డారు. రాహుల్‌ అసమర్థతే మోదీకి ఎంతో ప్రయోజమని అన్నారు. తిరువనంతపురంలో జరుగుతున్న ‘కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ రెండోరోజు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రగుహా ‘దేశభక్తి-మతోన్మాదం’ అంశంపై ప్రసంగించారు.

‘ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నేడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్‌పై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నేటి యంగ్‌ జనరేషన్‌కి ఐదో తరానికి చెందిన రాహుల్‌ గాంధీ నాయకత్వం అవసరం లేదు. ఆయన కుటుంబ కంచుకోట అయిన అమేథిలోనే ఓటమి చెందారు. రాహుల్‌ను కేరళ ప్రజలు ఎంపీగా ఎన్నుకుని తప్పిదం చేశారు. 2024లో మరోసారి అదేపని చేస్తే మోదీకి ఎంతో లబ్ధిచేకూర్చినట్లు అవుతుంది. రాజకీయంలో మోదీకి ఉన్న పరిపక్వత రాహుల్‌కు లేదు.

గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసి.. పరిపాలనాపరమైన అనుభవాలను మోదీ పొందారు. ఆయనకు ఉన్న కష్టించే తత్వం ముందు రాహుల్‌ నిలువలేరు. రాహుల్‌లా నెలలో 15 రోజులు మోదీ యూరప్‌ ట్రిప్పులకు వెళ్లరు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ కేవలం ఢిల్లీకే పరిమితమైయ్యారు. దేశ వ్యాప్తంగా పార్టీ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. కాగా రామచంద్రగుహ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలినుంచి మోదీకి వ్యతిరేకంగా ఉండే ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు