జిల్లాకు ఏం చేశారో చెప్పండి?

5 Oct, 2018 13:46 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీవై రామయ్య, చిత్రంలో శిల్పా చక్రపాణి రెడ్డి, మురళీ కృష్ణ తదితరులు

హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపలేకపోయారు  

డిప్యూటీ సీఎంపై నిప్పులు చెరిగిన బీవై రామయ్య

నిరుద్యోగ భృతి బూటకమన్న శిల్పా చక్రపాణిరెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా  అధ్యక్షుడు  శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాకు..ఈ పనిచేశానని గుండెల మీద చేయి వేసుకోవాలని చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి పత్తికొండ నియోజకవర్గంలోని హంద్రీ–నీవా కాలువ నుంచి చెరువులకు నీళ్లు నింపుకోలేకపోయారని విమర్శించారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి తన ప్రాంత రైతులకు సాగునీటి కోసం ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తెచ్చి సాధించుకున్నారో చూసి నేర్చుకోవాలని సూచించారు. తమ్ముడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం కోసం రాత్రిళ్లు నిద్రపట్టడడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కేఈ కృష్ణమూర్తి మరచి పోయారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం బీసీలకే సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత డిప్యూటీ సీఎంకు లేదన్నారు.  సీఎం చంద్రబాబునాయుడు మెప్పు కోసం తమ పార్టీ అధినేతను విమర్శించడం మంచిపద్ధతి కాదన్నారు.   

ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి
వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయన్నారు. భృతిని మాత్రం మంత్రి లోకేష్‌నాయుడు 10 లక్షలకు కుదించారన్నారు. అందులోనూ ఆరు లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే 2.20 లక్షల మందికే రూ.వెయ్యి భృతి మంజూరైందన్నారు. ఇది ముమ్మాటీకీ నిరుద్యోగులను దగా చేయడమేనన్నారు. కొందరు నిరుద్యోగులు భృతి తీసుకుంటే ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వమంటారోనని చేసిన దరఖాస్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకర్గ ఇన్‌చార్జి మురళీకృష్ణ, నాయకులు సీహెచ్‌ మద్దయ్య, మదారపు రేణుకమ్మ, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, అనుమంతరెడ్డి, నాగరాజుయాదవ్, డీకే రాజశేఖర్, కరుణాకరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కటారి సురేష్, రైల్వే ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీపై వైఎస్సార్‌సీపీ పోరాటాలుకనిపించడంలేదా?
ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి బీజేపీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న పోరాటాలు కనిపించడంలేదా అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని బీవై రామయ్య ప్రశ్నించారు. హోదా కోసం బం ద్‌లు, దీక్షలు, నిరసనలు, రాస్తారోకోలు, యువ భేరీలు, అవిశ్వాస తీర్మానాలు, ఎంపీల రాజీనామాలు..ఎవరిపై చేపట్టినట్లో చెప్పాలన్నారు. బీజేపీతో నాలుగున్నరేళ్ల పాటు కలిసి ఉండి.. బయటకు వచ్చి ఇప్పుడు ధర్మ పోరాటాలు చేస్తే ఏమి లాభమని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసే దమ్ములేక రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభ జించిన కాంగ్రెస్‌తో ఏ ముఖం పెట్టుకొని పొత్తు పెట్టుకుంటున్నారని, ఈ విషయంపై చంద్రబాబునాయుడిని కేఈ నిలదీయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు