మళ్లీ నేనే!

7 Nov, 2018 03:04 IST|Sakshi

రమణ్‌ సింగ్‌ సామాజిక వర్గం ఠాకూర్‌. వీరి సంఖ్య రాష్ట్ర జనాభాలో 0.5% మాత్రమే.

రాజకీయాల్లోకి రాకముందు (1980ల్లో) రమణ్‌ సింగ్‌ ఆయుర్వేదిక్‌ డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసేవారు.

రమణ్‌ సింగ్‌పై మాజీ ప్రధాని వాజ్‌పేయి కోడలు కరుణా శుక్లా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు.

బీజేపీపై బలహీన అభ్యర్థులను బరిలో ఉంచడం ద్వారా జోగి.. బీజేపీ బీ–టీమ్‌లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ విమర్శలు. 

దేశవ్యాప్తంగా బీజేపీ కంచుకోటల్లో ఛత్తీస్‌గఢ్‌ ఒకటి. ఏకబిగిన మూడుసార్లు ఇక్కడ సీఎం రమణ్‌ సింగ్‌ నేతృత్వంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఒకప్పటి కాంగ్రెస్‌ అడ్డా అయిన ఛత్తీస్‌గఢ్‌పై బీజేపీ పట్టు వెనక రమణ్‌ పాత్ర కీలకం. ఆ ధీమాతోనే ఆయన కూడా నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు. జోగి రాక బీజేపీకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టమంటున్నారు. నక్సల్స్, కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ  విజయావకాశాలపై రమణ్‌ సింగ్‌ లెక్కలేంటి?

 మావోయిస్టులను అణచేస్తాం
‘మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం అప్రజాస్వామికం. ఎన్నికలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం.. చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు హెచ్చరించడమేంటి. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. ఇప్పుడు బస్తర్‌ ప్రాంతానికే వారు పరిమితమయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి రాగానే ఈ దిశగా మా కార్యాచరణ ప్రారంభిస్తాం.  వాస్తవానికి గత ఎన్నికల్లోనే (2013)మాకు తీవ్రమైన పోటీ ఉంది. అప్పుడే కాంగ్రెస్‌ నేతలను నక్సలైట్లు కాల్చి చంపారు. అంతటి సానుభూతిలోనూ మేం విజయం సాధించాం. ఇప్పుడు అంతటి తీవ్రమైన పోటీ పెద్దగా ఎదురవడం లేదు’

జోగి రావడం మంచిదే!
‘అజిత్‌ జోగి పోటీలో రావడం మంచిదే. జోగి తన సొంతపార్టీతో పోటీ చేయడం ఈ ఎన్నికలను మరింత రసతవత్తరంగా మారుస్తుంది. ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతుండటం.. బీజేపీ, కాంగ్రెస్‌లపై దీని ప్రభావం ఉంటుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇది.. కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం చేస్తుంది. ఆయన్ను ఇప్పటికీ కాంగ్రెస్‌ నేతగానే ప్రజలు భావిస్తున్నారు’

గిరిజనులెప్పుడూ మావెంటే..
‘ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాల్లో 29 గిరిజనులకు, 10 ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. మిగిలినవి జనరల్‌ స్థానాలు. గతంలో ఎస్సీ స్థానాల్లో ఎక్కువ మేమే గెలిచాం. గిరిజనులెప్పుడూ బీజేపీతోనే ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో కులసమీకరణాల ప్రభావం పెద్దగా ఉండదు. నేను తటస్థ వాదిని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలూ నన్ను ఆదరిస్తాయి. అయినా.. అభివృద్ధి అంశంపైనే మేం ఈ సారి ఎన్నికల బరిలో నిలుచున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మేమేం చేశామో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే పదానికి తావే లేదు’

మరిన్ని వార్తలు