టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు

25 May, 2018 13:17 IST|Sakshi
వేమూరి ఆనంద సూర్య (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టకు భంగం కలిగించేలా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ బ్రహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌ వేమూరి ఆనంద్ సూర్య  ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రమణ దీక్షితులు ఆగమ శాస్త్ర విలువలను మంటగలిపరంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్చకులను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నుంచి దూరం చేయడానికి రమణ దీక్షితులు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు నమ్మక ద్రోహి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పింక్‌ డైమండ్‌ అనేదే లేదని జడ్జీల కమిటీలు ప్రకటించాయని చెప్పారు. రూబీ ముక్కలైందని మీరే కదా నిర్ధారించారు అంటూ ఐవైఆర్‌ను నిలదీశారు. రమణదీక్షితులు నాటకం వెనుక మోదీ, అమిత్‌ షా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి పోటు దగ్గర రిపేర్లు చేస్తున్నప్పుడు 2వ ప్రాకారంలో వంట చేయొచ్చని చెప్పింది రమణ దీక్షితులేనని వెల్లడించారు.

టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ వేంకటేశ్వర స్వామిని ‘వెంకన్న చౌదరి’ అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వేంటేశ్వర స్వామి అన్ని కులాలకు దేవుడని అన్నారు. అయినా వేంకటేశ్వర స్వామిని మురళీ మోహన్‌ ఏమన్నారో తాను వినలేదని చెప్పారు. వినిపిస్తామని మీడియా ప్రతినిధులు చెప్పడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ విషయంపై మళ్లీ మాట్లాడుతానంటూ వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు